26న నూతన మఠాధిపతికి పట్టాభిషేకం | - | Sakshi
Sakshi News home page

26న నూతన మఠాధిపతికి పట్టాభిషేకం

Feb 7 2026 9:53 AM | Updated on Feb 7 2026 9:53 AM

26న న

26న నూతన మఠాధిపతికి పట్టాభిషేకం

భారీగా పాల్గొననున్న భక్తులు

మూడు రోజుల పాటు కార్యక్రమాలు

ఘనంగా ఏర్పాట్లు

బ్రహ్మంగారిమఠం(వైఎస్‌ఆర్‌ జిల్లా) : కాలజ్ఞాన ప్రభోదకర్త శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠం నూతన మఠాధిపతిగా శ్రీ వెంకటాద్రిస్వామి పట్టాభిషేకం ఈ నెల 26న ఘనంగా నిర్వహించనున్నారు. పూర్వపు మఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి 2021 మే 8న శివైక్యం చెందారు. తదుపరి మఠాధిపతి పదవీ కోసం వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి కుమారులు ఒకరికొకరు పోటీ పడటంతో జాప్యం జరిగింది. ప్రధానంగా పూర్వపు మఠాధిపతి పెద్ద భార్య జ్యేష్ట పుత్రుడు వెంకటాద్రిస్వామి, రెండవ భార్య మారుతి మహాలక్షుమ్మ పెద్ద కుమారుడు గోవిందస్వామి తీవ్రంగా పోటీ పడ్డారు. కోర్టు కేసులు నడిచాయి. చివరికి ధార్మిక పరిషత్‌ వెంకటాద్రిస్వామిని మఠాధిపతిగా నియమించింది. ఆయన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి 8వ తరం మునిమనవడు. ఇప్పటి వరకు బ్రహ్మంగారిమఠానికి 11 మంది మఠాధిపతులుగా బాధ్యతలు నిర్వర్తించారు. వెంకటాద్రిస్వామి 12వ మఠాధిపతి.

24 నుంచి కార్యక్రమాలు

వెంకటాద్రిస్వామి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఈ నెల 24 నుంచి 26 వరకు జరగనున్నాయి. 24న ఉదయం సుప్రభాతం, మంగళతోరణ బంధన, మృత్తికా స్నపనం, సర్వ ప్రాయశ్చిత్తాలు, ప్రత్యక్ష కృఛ్రత్రయాలు, వేదోపనిషత్‌ పారాయణ, మంగళద్రవ్యాలతో అధిష్టాన మూర్తి దైవదర్శనం, అనుజ్ఞ, సప్త గోప్రదక్షిణ పూర్వక గోపూజ, ప్రధాన సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ప్రాశన, రక్షాబంధన, అఖండ స్థాపన, రుత్విగ్వరణ, ధీక్షాధారణ, ప్రధాన కలశ స్థాపన, ఆయుష్య సూక్త పారాయణ, రుగ్వేద, యజుర్వేద పారాయణ, సర్వతోభద్ర మండల, కాలచక్ర, నవగ్రహ, దిక్పాలక, అధిష్టాన మూర్తుల, పూర్వ మఠాధిపతుల స్మరణ ఆవాహన, అగ్ని ప్రతిష్టాపన, అష్ట ద్రవ్య సహిత విశేష గణపతి హోమం, షోడశోపచార పూజలు, మంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం అంకురార్పణ, నిత్య విధులు, వేద పారాయణం, నిత్య హోమం, మంత్రపుష్ప చతుర్వేద స్వస్తి, తీర్థ ప్రసాద వినియోగం తదితరాలు నిర్వహించనున్నారు.

● 25న ఉదయం వేదోపనిషత్‌ పారాయణ, గోపూజ, గణపతి పూజ, పుణ్యాహ వాచన, పంచగవ్య ప్రాశన, ఆవాహిత మండపార్చనలు, కూష్మాండ సూక్త పారాయణ, సూర్యోపాశన, సూర్య నమస్కారాలు, హోమం, సప్తసాగర జీవనదుల వైదిక పూర్వక కలశా వాహనములు, రుద్రహోమం, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల వారి కాలజ్ఞాన చూర్ణికా హోమాలు, దూపదీప నైవేద్య మంత్ర పుష్ప నీరాజన తీర్థ ప్రసాదాలు తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు. సాయంత్రం నిత్య విధులు, సామ్రాజ్య మహాలక్ష్మీ సూక్త పారాయణం, హోమాలు, సప్తసాగర జీవ నదులు మంత్ర జలాలతో విశేష స్నపనం, వైదిక హోమం, వేదపారాయణం, మంత్ర పుష్పం, చతుర్వేద స్వస్తి, తీర్థ ప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు ఉంటాయి.

● 26న ఉదయం వేద సూక్త పారాయణ, గణపతి పూజ, పుణ్యాహ వాచన, ఆవాహనాది దేవతా హోమాలు, సర్వశాంతర్థ్యం, రుద్రహోమం, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల వారి బీజాక్షర సహిత చూర్ణికా హోమం, జయాది హోమం, మహా పూర్ణాహుతి, సాగర నదీ జలాల ఆవాహిత జలాలను సమంత్రకంగా, ప్రధాన కలశంలోనికి సమ్మేళన చేయుట, అవబృథస్నానం, పట్టాభిషేక వేదిక ప్రవేశం, కిరీట, ఛత్ర, చామర, ఆందోళిక అంగుళ్యీభరణ, మకరకుండల, శిఖాముద్రిక, సింహతలాట, సంహాసనాది, పేనదండ, రుద్రాక్షమాల, పాదుకా పూజ, సుమూర్తానికి ధారణ, అధిష్టాన మూర్తిదర్శనం, వేద స్వస్తి పండిత సత్కారం కార్యక్రమాలు చేపడుతారు. సాయంత్రం నూతన మఠాధిపతుల అనుగ్రహ భాషణం, వేదోక్త మంగళశాసనాలు ఉంటాయి.

అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

బ్రహ్మంగారిమఠం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని నూతన మఠాధిపతి శ్రీ వెంకటాద్రిస్వామి తెలిపారు. ఇంత వరకు అభివృద్ధి పనులు ఎంత వరకు జరిగాయి, ఇంకా ఏమి చేయాలి అనే దానిపై దృష్టి సారిస్తామని ఆయన పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉండాలి అనే దానిపై పరిశీలిస్తామన్నారు. మఠం ప్రగతి కోసం కందిమల్లయ్యపల్లె పుర ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎండోమెంట్‌ అధికారుల సహకారం తీసుకుంటామన్నారు.

బ్రహ్మంగారిమఠంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానం పట్టాభిషేకంపై చర్చిస్తున్న మఠాధిపతి, ఆస్థాన పండితులు (ఫైల్‌)

మూడు రోజుల పాటు జరిగే పట్టాభిషేక మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మఠం అధికారులు, సిబ్బంది, స్వామి వారి శిష్యులు ఈ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనాలని పీఠాధిపతులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులకు ఆహ్వాన పత్రికలను మఠం వారు అందజేసి పిలుస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉండటంతో.. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

26న నూతన మఠాధిపతికి పట్టాభిషేకం1
1/1

26న నూతన మఠాధిపతికి పట్టాభిషేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement