భక్తిశ్రద్ధలతో లక్ష కుంకుమార్చన | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో లక్ష కుంకుమార్చన

Feb 7 2026 9:53 AM | Updated on Feb 7 2026 9:53 AM

భక్తిశ్రద్ధలతో లక్ష కుంకుమార్చన

భక్తిశ్రద్ధలతో లక్ష కుంకుమార్చన

చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో మాఘమాసం నెలలో అత్యంత వైభవంగా నిర్వహించే లక్ష కుంకుమార్చన పూజలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా వేద పండితులు, అర్చకుల మంత్రోచ్చారణల మధ్య ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు చేసి, దంపతులకు పూజా సామగ్రి అందజేశారు. అమ్మవారి ఉత్సవమూర్తి ఎదుట ప్రత్యేక పూజలు, గణపతి, చండీహోమం, పూర్ణాహుతి, మహా మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుమునుపే రూ.1500 చెల్లించిన ఉభయదారుల దంపతులతో వేద పురోహితులు అమ్మవారి సన్నిధిలో పూజలు చేయించారు. ఈ కార్యక్రమానికి 332 జంటల దంపతులు హాజరై భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయంలో రద్దీ నెలకొంది. పూజా కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.

ప్రమాదాల నివారణపై అవగాహన అవసరం

కలకడ : హెచ్‌పీసీఎల్‌ గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ పైప్‌లైన్‌ వద్ద ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని కడప డీఎఫ్‌ఓ ఆదినారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని దేవుపల్లె పంచాయతీలో సర్పంచ్‌ వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన ఆఫ్‌సైట్‌ మాక్‌డ్రిల్‌ కార్యక్రమం హెచ్‌పీసీఎల్‌ కంపెనీ చీఫ్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. డీజిల్‌ పైప్‌ లీకేజీ అయినా, ప్రమాదం సంభవించినా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు సమాచారం అందించడం, ప్రమాదం జరిగినా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మాక్‌డ్రిల్‌లో చేసి చూపించారు. రైతుల పొలాల్లో తీసిన డీజిల్‌ పైప్‌లైన్‌ గత 10 ఏళ్లుగా ఎక్కడా లీకేజీలు లేవని, ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్లాంట్‌ చీఫ్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, రైతుల అభివృద్ధికి సంస్థ నుంచి నిధులు కేటాయింపునకు కృషి చేస్తుట్లు మేనేజర్‌ చిన్నారావు తెలిపారు. తహసీల్దార్‌ మహేశ్వరిభాయ్‌, ఎస్‌ఐ రామాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.

నాలుగు 104 అంబులెన్స్‌లు అపహరణ

– డీఎంహెచ్‌ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు

రాయచోటి : దొంగల కన్ను నిల్వ ఉంచిన ప్రభుత్వ వాహనాలపై పడింది. సర్వీసు ముగిసి శిథిలావస్థకు చేరిన వాహనాలను డీఎంహెచ్‌ఓ కార్యాలయ అధికారులు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణం నుంచి పట్టణ పరిధిలోని డంపింగ్‌ యార్డ్‌ ఆవరణలోకి తరలించారు. యార్డులో నిల్వ ఉంచిన నాలుగు 104 వాహనాలను గుట్టు చప్పుడు కాకుండా తరలించుకుపోయినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం అన్నమయ్య జిల్లా డీఎంహెచ్‌ఓ లక్ష్మీనరసయ్య ఫిర్యాదు మేరకు రాయచోటి అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు 108తోపాటు 104 (గ్రామీణ సంచార వైద్యశాల) వాహనాలను వినియోగంలోకి తెచ్చారు. ఈ వాహనాలలో నాలుగు వాహనాలకు సర్వీస్‌ ముగియడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రి ఆవరణలో నిల్వ ఉంచారు. ఆసుపత్రి ఆవరణ పరిధిలో నిర్మాణ పనులు ఉండడంతో.. వాటిని మున్సిపాలిటీ డంపింగ్‌ యార్డ్‌ ఆవరణలోకి తరలించారు. కొన్ని నెలలుగా వాటిపై దృష్టి పెట్టకపోవడంతో పసిగట్టిన దొంగలు ఆ వాహనాలను గుట్టు చప్పుడు కాకుండా తరలించుకు వెళ్లినట్లు సమాచారం. శిథిలావస్థ దశకు చేరుకున్న ఈ వాహనాల విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. యార్డులో సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా.. నిల్వ ఉంచిన వాహనాలను ఎప్పుడు? ఎలా? తీసుకెళ్లారన్న విషయం అర్థం కావడం లేదు. శుక్రవారం ఉదయం అందిన సమాచారం మేరకు లక్ష్మీనరసయ్య ఆ ప్రాంతాన్ని పరిశీలించి అనంతరం రాయచోటి అర్బన్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement