అత్యాచారయత్నంపై ఫిర్యాదు
మదనపల్లె టౌన్ : కురబలకోట మండలం తుమ్మచెట్లపల్లెలో గురువారం రాత్రి స్థానికుడైన సురేంద్ర (59)పై అదే గ్రామానికి చెందిన రమణ వర్గీయులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెనుక పాత కక్షలు కారణమని తెలుస్తోంది. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి డీఎస్పీ కార్యాలయాలనికి శుక్రవారం వచ్చి తనపై అత్యాచారయత్నం చేశారని ఆరోపిస్తూ డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. నిందితులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరింది.
ఒంటరి వ్యక్తిపై అమానుష దాడి
– పార్టీ స్టిక్కర్ తీయకపోవడంతో కొట్టిన వైనం
మదనపల్లి టౌన్/కురబలకోట : అయిన వారు ఎవరూ లేక ఒంటరిగా జీవిస్తున్న మండలంలోని తుమ్మచెట్లపల్లికి చెందిన జరిపిటి సురేంద్ర(56)పై అమానుష దాడి జరగడంతో పలువురిలో విచారం వ్యక్తమవుతోంది. గురువారం రాత్రి ఇతనిపై సమీప బంధువులే విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్ర రక్తగాయాలకు గురి చేసిన విషయం తెలిసిందే. తిరుపతి ఆసుపత్రిలో దయనీయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. జరిపిటి సురేంద్రకు తల్లిదండ్రులు చనిపోయారు. భార్య ఎప్పుడో వెళ్లిపోయింది. అతని వద్ద ఎవ్వరూ లేరు. ఒంటరిగా ఉంటున్నాడు. ఇల్లు తప్ప ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. గతంలో మద్యం తాగేవాడు. ఆరేళ్లుగా మద్యం కూడా మానేసి మారిన మనిషిగా ఊరిలో పేరు తెచ్చుకున్నాడు. తెలిసిన వారు పిలిస్తే పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. కలకలం రేపిన సంఘటనపై శుక్రవారం గ్రామంలో ఎస్‌ఐ మధు రామచంద్రుడు విచారణ జరిపారు. బాధితుడు సురేంద్రకు టూవీలర్ ఉంది. దీనిపై ఓ పార్టీకి చెందిన స్టిక్కర్ వేసుకున్నాడు. గురువారం రాత్రి ఇంటికి వచ్చిన అతన్ని పక్కింట్లో ఉన్న రమణయ్య టూవీలర్‌పై ఉన్న స్టిక్కఽర్ తొలగించాలన్నాడు. దీంతో మాటకుమాట పెరిగి వివాదం చోటుచేసుకుంది. ఇది కాస్తా దాడికి దారి తీసింది. ప్రత్యర్థులు రమణయ్యతోపాటు ఐదుగురు ఇతనిపై అమానుషంగా కట్టెలు, రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. తీవ్ర రక్తగాయాలు అయినట్లు విచారణలో తేలినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఒక చెయ్యి కూడా విరిగిపోయింది. శుక్రవారం ముదివేడు పోలీసులు తిరుపతి ఆసుపత్రికి వెళ్లి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రమణయ్యతోపాటు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా ఈ సంఘటన పరిసర ప్రాంతాల్లో కలకలాన్ని సృష్టించింది.
యువతి అదృశ్యం
రాయచోటి : మతిస్థిమితం లేని యువతి షేక్ షమీమ్(31) రాయచోటిలో అదృశ్యమైనట్లు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. గురువారం సాయంత్రం కడపకు వెళ్లడానికి నారాయణరావు కుమార్తె షమీమ్తో కలిసి ఇంటి నుంచి బస్టాండుకు చేరుకున్నారు. కుమార్తెను బస్టాండులో వదిలి బైక్ పార్క్ చేసి తిరిగి వెళ్లే సమయానికి కుమార్తె కనిపించలేదు. రోజంతా వెతికినా కనిపించకపోవడంతో శుక్రవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తండ్రి నారాయణరావు తెలిపారు. ఫిర్యాదు పై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు అర్బన్ పోలీసులు పేర్కొన్నారు.
అత్యాచారయత్నంపై ఫిర్యాదు


