తత్కాల్ కింద ఫీజు చెల్లింపునకు అవకాశం
మదనపల్లె సిటీ: ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించని రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులకు తత్కాల్ స్కీం కింద మరో అవకాశం కల్పించారని డీఈఓ సుబ్రమణ్యం తెలిపారు. సంబంధిత తత్కాల్ ఫీజును ఈనెల 12వ తేదీ వరకు చెల్లించవచ్చునని చెప్పారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ లాగిన ద్వారా మాత్రమే www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫీజు చెల్లించడంతో పాటు నామినల్ రోల్స్ సమర్పించాలని తెలిపారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థుఽలకు మాత్రమే ఈ అవకావం ఉందని తెలిపారు.
మదనపల్లె: ఈనెలాఖరులోగా జిల్లాలోని పంచాయతీల్లో రూ.10 కోట్ల పన్నుల వసూళ్లను లక్ష్యంగా చేసుకున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ అన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ జిల్లాలోని పంచాయతీల్లో 2,81,161 నివాస గృహలు ఉండగా వాటికి సంబంధించిన పాత బకాయిలు రూ.2.33 కోట్లు ఉన్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సర బకాయి రూ.12.66 కోట్లు ఉన్నట్టు చెప్పారు. ఈ రెండు కలిపి రూ.15.01 కోట్ల బకాయిలు వసూలు చేయాల్సి ఉందన్నారు. ఇందులో ఇప్పటిదాకా పాత బకాయిలు రూ.59.83 లక్షలు, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4.96 కోట్లు వసూలైనట్టు చెప్పారు. ఇంకా పాత బకాయిలు రూ.1.79 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8.31 కోట్లు వసూలు చేయాల్సి ఉందన్నారు. ఈ మొత్తం రూ.10.11 కోట్లను ఈనెలాఖరులోగా వసూలు చేయాలని పంచాయతీ కార్యదర్శకులకు ఆదేశించినట్టు చెప్పారు. వసూళ్లపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలోని పూలంగళ్ల సర్కిల్ వద్ద జరుగుతున్న శ్రీరంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు శుక్రవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. ప్రధాన అర్చకులు కృష్ణరాజేష్ శర్మ వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణఘట్టాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. సతీసమేతుడైన శ్రీరంగనాథుని ముగ్ధమోహన రూపాన్ని చూసి భక్తులు తరించారు. పురోహితులు మంగళసూత్రాలను భక్తులకు చూపించి స్వామివారి చేతికి తాకించి అమ్మవార్ల మెడలో వేశారు.శాశ్వత కల్యాణ ఉభయదారులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన చల్లా నారాయణస్వామి, ఉమాదేవి దంపతులు, కుటుంబ సభ్యులతో కల్యాణం జరిపించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంచిపెట్టారు. అలాగే సాయంత్రం స్వామివారు సతీ సమేతుడై గజ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు శనివారం ఉదయం రంగనాథస్వామి బ్రహ్మ రథోత్సవం జరుగుతుంది.
మదనపల్లె సిటీ: విభిన్న ప్రతిభావంతులతోనే మార్పు మొదలవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం, సమగ్ర శిక్ష ఏపీసీ అనూరాధ అన్నారు. మదనపల్లెలో శుక్రవారం సహిత విద్య విభాగం ఆధ్వర్యంలో ఆర్ట్ అండర్ కల్చరల్ పోటీలు ప్రత్యేక అవసరాల పిల్లలకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ముగింపు సమావేశంలో డీఈఓ,ఏపీసీలు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు తగిన అవకాశాలు ఇస్తే ఏ రంగంలోనైనా రాణించి అద్భుతాలు సృష్టిస్తారన్నారు. దివ్యాంగుల హక్కులు, సంక్షేమ పథకాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాజం మొత్తం విభిన్న ప్రతిభావంతులను అర్థం చేసుకుని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పలు దేశభక్తి, జానపద నృత్యాలు, ఆర్ట్, డ్రాయింగ్, క్రాప్ట్ పోటీలు, వివిధ రకాల వేషధారణ పోటీలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సహిత విద్య కోఆర్డినేటర్ జనార్థన్, ఎంఈఓ ప్రభాకర్‌రెడ్డి, ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తత్కాల్ కింద ఫీజు చెల్లింపునకు అవకాశం


