ఫ్యామిలీ సర్వే పక్కాగా చేపట్టాలి
చిన్నమండెం: చిన్నమండెం మండలంలోని వండాడి గ్రామ పంచాయతీలోని తూర్పుపల్లెలో నిర్వహిస్తున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే (యుఎఫ్‌ఎస్) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి ప్రతి కుటుంబానికి సంబంధించిన ఆర్థిక సామాజిక విద్య, ఉద్యోగ తదితర వివరాలను ఏ విధంగా నమోదు చేస్తున్నారో కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2025 నుంచి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అన్నారు. దీనిని పక్కాగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన ఆర్థిక సామాజిక, విద్య, ఉద్యోగ వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారని తెలిపారు. ఈ సమాచారం ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందడంతో పాటు యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
లక్కిరెడ్డిపల్లి: పట్టాదారు పాసుపుస్తకంలోని క్యూఆర్ కోడ్ ద్వారా భూ యజమాని, భూమి వివరాలు సులభంగా తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం లక్కిరెడ్డిపల్లి మండలం, కుర్నూతుల గ్రామం, వెంకటరాజుగారిపల్లిలో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన రీసర్వే కార్యక్రమంలో అధునాతన సాంకేతికత ద్వారా భూ సమస్యలను, వివాదాలను పరిష్కరించగలుగుతామన్నారు. అధునాతన సాంకేతికత ద్వారా రైతుకు ఎంత భూమి ఉంది.. ఎక్కడ ఉంది.. తదితర అంశాలను స్పష్టంగా, సులభంగా గుర్తించగలుగుతామన్నారు. రెవెన్యూ గ్రామ సభలను సచివాలయ స్థాయిలో నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ ఈ కార్యక్రమాలను వినియోగించుకోవాలని సూచించారు. కలెక్టర్ పలువురు లబ్ధిదారులతో మాట్లాడుతూ పట్టాదారు పాసుపుస్తకంలో సరియైన వివరాలు నమోదు చేసి ఉన్నారా లేక ఏమైనా తప్పులు ఉన్నాయా, ఆధార్ నంబర్ సరిగా ఉందా వంటి పలు ప్రశ్నలను అడుగగా సరియైన వివరాలను చేర్చి ఉన్నారని వారు సమాధానం ఇచ్చారు. పట్టాదారు పాస్ పుస్తకాలలో తప్పులు దొర్లితే వెంటనే పరిష్కరించాలని మండల తహసీల్దార్‌ను ఆదేశించారు. మండల తహసీల్దార్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ రీసర్వే పూర్తయిన గ్రామాల్లో నిర్వహిస్తున్న పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూతన పట్టాదారు పాసుపుస్తకంలోని క్యూఆర్ కోడ్‌ను ఏ విధంగా వినియోగించుకోవాలో లబ్ధిదారులకు వివరించారు. ఆధార్, ఫోన్ నంబర్లలో తప్పులు ఉంటే వెంటనే అర్జీ పెట్టుకొని పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ క్రాంతి కుమార్, ఆర్‌ఐ రాజేష్, వీఆర్‌ఓలు, రైతులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్


