నానో ఎరువులతో పెరగనున్న పంటల దిగుబడి
మదనపల్లె రూరల్: నానో ఎరువుల వాడకంతో పంటల నాణ్యత, దిగుబడి గణనీయంగా పెరుగుతాయని జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో వ్యవసాయశాఖ, ఇఫ్కో సహకార సంస్థ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా ఎరువులు, పురుగుమందుల వ్యాపారులకు నానో ఎరువులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ శివనారాయణ మాట్లాడుతూ... జిల్లాలోని పలు పంటల్లో నిర్వహించిన క్షేత్రపరీక్షల ఫలితాల ఆధారంగా నానో ఎరువులు మంచి దిగుబడులు ఇస్తున్నాయని తెలిపారు. వీటి పోషకాల శోషణ సామర్థ్యాన్ని పెంచి, పర్యావరణ హితంగా ఉంటూ, సంప్రదాయ రసాయన ఎరువుల వాడకాన్ని 20 నుంచి 25 శాతం తగ్గిస్తాయన్నారు. మొక్కలకు అవసరమైన పోషకాలను నేరుగా అందించడంతో పంట ఆరోగ్యం పెరుగుతుందన్నారు. నానో యూరియా వాడకం వల్ల నేల ఆరోగ్యం బాగుంటుందన్నారు. మండల వ్యవసాయాధికారి నవీన్‌రెడ్డి మాట్లాడుతూ..విచక్షణా రహితంగా వాడుతున్న ఎరువుల కారణంగా నేలకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. ప్రత్యామ్నాయ ఎరువులైన నానో ఎరువులు, జీవ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.


