సర్వేలెన్స్ అధికారిగా శ్రీధర్
మదనపల్లె టౌన్: జిల్లా సర్వేలెన్స్ అధికారిగా మదనపల్లె పీపీ యూనిట్ ఇన్‌చార్జిగా పని చేస్తున్న డాక్టర్ శ్రీధర్‌ను నియమిస్తూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లక్ష్మీనరసయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన జిల్లాలో రోగాల బారిన పడిన బాధితుల వివరాలు, జ్వర పీడితుల వివరాల సేకరణ తదతర విధులను నిర్వహిస్తారు.
మదనపల్లె టౌన్: జిల్లా కార్యక్రమాల సమన్వయ అధికారి (డీపీఎంఓ)గా మదనపల్లె డెప్యూటీ డీఎంహెచ్‌ఓ రమేష్‌బాబుకు బాధ్యతలు అప్పగిస్తూ డీఎంహెచ్‌ఓ లక్ష్మీనరసయ్య గురువారం ఉత్తర్వు జారీ చేశారు. ఇక్కడ ఉన్న డెప్యూటీ డీఎంహెచ్‌ఓ కార్యాలయం కుప్పానికి తరలిపోవడంతో ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించారు. డీపీఎంఓ పరిధిలోని వివిధ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలుపై చర్యలు తీసుకుంటారు.
మదనపల్లె సిటీ: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశం కోసం అర్హులైన గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పి.తేజస్విని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాయచోటి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల(బాలికలు)లో ఓసీ–2, బీసీ–4, ఎస్సీ–10, ఎస్‌టీ–64, కె.వి.పల్లి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికలు)లో ఓసీ–2, బీసీ–4, ఎస్సీ–10, ఎస్టీ 64 ఖాళీలు ఉన్నాయన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో ఈనెల 5వ తేదీ నుంచి 28లోపు పంపాలన్నారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 4న రాయచోటి గిరిజన గురుకులంలో నిర్వహిస్తామని వివరించారు.
నిమ్మనపల్లె: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించాలని జిల్లా విద్యా శాఖ అధికారి సుబ్రమణ్యం తెలిపారు. గురువారం మండలంలోని రెడ్డివారిపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్‌ను ఆయన తనిఖీ చేశారు. ముష్టూరు కేజీబీవీ విద్యాలయంలో జరిగిన పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యార్థులు ప్రణాళికబద్ధంగా పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. ఏకాగ్రతతో చదివి పాఠ్యంశాలను గుర్తు పెట్టుకోవాలన్నారు. ఉపాధ్యాయులు సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆచరణలో పెట్టాలన్నారు. పరీక్షలపై భయం వీడి చక్కని ప్రతిభ చూపాలన్నారు. వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎంఈఓలు పద్మావతి, నారాయణ, కేజీబీవీ ప్రిన్సిపాల్ మునివెంకటమ్మ, మోడల్‌స్కూల్ ప్రిన్సిపాల్ అమృత ప్రియదర్శిని, రెడ్డివారిపల్లె హైస్కూల్ హెచ్‌ఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
గాలివీడు: మండలంలోని వివిధ రకాల రైస్, నూనె గింజల మిల్లర్ల యజమానులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా మార్కెటింగ్ శాఖ ఏడీ త్యాగరాజు హెచ్చరించారు. గురువారం ఆయన మండలంలోని రైస్ మిల్లులు, నూనె గింజల మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మిల్లర్ల యజమానులతో మాట్లాడారు. ప్రతి నెల అమ్మకాలు–కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు మార్కెటింగ్ కార్యదర్శికి అందజేయాలని సూచించారు. అలాగే ఏడాది కాలంలో జరిగిన లావాదేవీలకు సంబంధించి మార్కెట్ సెస్సును విధివిధానాల ప్రకారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సెస్సు చెల్లించని పక్షంలో మార్కెట్ సరుకు విలువ ఆధారంగా సెస్సును శాఖే నిర్ణయించి విధించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా, లావాదేవీలకు సంబంధించిన సెస్సు చెల్లించకుండా ఉంటే ఒకటి నుంచి నాలుగు రెట్ల వరకు అపరాధ రుసుంతో కూడిన జరిమానా విధించి, మార్కెట్ చట్ట నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే సెస్సు చెల్లించని మిల్లర్ల యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కార్యదర్శి రమణమ్మతోపాటు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
సర్వేలెన్స్ అధికారిగా శ్రీధర్


