ఎంపీపీ ఎన్నికకు రెండోసారి ఎంపీటీసీల గైర్హాజరు
బి.కొత్తకోట: బి.కొత్తకోట మండల పరిషత్ అధ్యక్ష పదవికి రెండోసారి గురువారం నిర్వహించిన ఎన్నిక సమావేశానికి ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు. డివిజనల్ అభివృద్ధి అధికారి (డీడీఓ) అమరనాథరెడ్డి, ఎంపీడీఓ అబ్దుల్ షుకూర్ ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకే సమావేశ సమయం నిర్ణయించి సమావేశానికి హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటలు అయినా ఒక్క ఎంపీటీసీ కూడా హాజరు కాకపోవడంతో ఎన్నిక జరగలేదని డీడీఓ ప్రకటించారు. మండలంలో మొత్తం 11 మంది ఎంపీటీసీలు ఉండగా వారిలో లక్ష్మీనరసమ్మను ఎంపీటీసీలు ఎంపీపీగా ఎన్నుకున్నారు. తర్వాత ఆమె వ్యవహరశైలితో విసిగిపోయిన ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానంతో పదవీ నుంచి తొలగించారు. తర్వాత వైస్ ఎంపీపీ ఎన్.రాధను ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఇప్పుడు ఎంపీపీ పదవికి పూర్తి స్థాయిలో నియామకం చేయడం కోసం ఎన్నిక ఏర్పాట్లు చేశారు. బుధవారం ఎన్నిక సమావేశం నిర్ణయించగా ఎంపీటీసీలు హాజరు కాలేదు. తిరిగి రెండోసారి సమావేశం జరిపినా అదే పరిస్థితి నెలకొంది. దాంతో ఈ విషయాన్ని ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) దృష్టికి తీసుకెళ్తామని డీడీఓ తెలిపారు. అక్కడి నుంచి అందే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఎస్‌ఈసీకి నివేదిస్తామన్న డీడీఓ


