కటర్ కాలిమీద పడి వెల్డర్‌కు తీవ్రగాయాలు
మదనపల్లె టౌన్ : మదనపల్లె సీటీఎంరోడ్డులోని ఎస్టేట్‌లోని ఓ వెల్డింగ్‌షాపులో పనిచేస్తున్న వెల్డర్ కాలిమీద కటర్ పడి, కాలు తెగి తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. జిల్లా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసుల కథనం మేరకు మండలంలోని బొమ్మనచెరువు గ్రామం, దండువారిపల్లెకు చెందిన ఖాదర్‌వల్లీ(40)రోజు మాదిరిగానే షాపులో వెల్డింగ్ పనులు చేయడానికి, సీటీఎంరోడ్డులోని ఎస్టేట్‌కు వచ్చాడు. కమ్మీలను కటర్‌తో కత్తిరిస్తుండగా ప్రమాదవశాత్తు ఎడమ కాలిమీద కటర్ పడింది. ఈ ఘటనలో కాలి ఎముకతో పాటు నరాలు తెగి గాయపడ్డాడు. సహచరులు గుర్తించి బాధితున్ని వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు.
మదనపల్లె టౌన్ : పెద్దతిప్పసముద్రం మండలంలో గురువారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై బాధితుల కుటుంబీకులు తెలిపిన వివరాలు..మల్లెల గ్రామానికి చెందిన వెంకటేష్(45), రమణమ్మ(40)బైకులో పనినిమిత్తం సమీపంలోని మల్లెలక్రాస్‌కు బయలుదేరారు. బైక్ పులికల్లు క్రాస్ వద్దకు రాగానే, జింకల గుంపు అడ్డురావడంతో తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు బి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రమణమ్మకు మెరుగైన వైద్యం అవసరం ఉందని డాక్టర్లు చెప్పడంతో, కుటుంబ సభ్యులు బాధితురాలిని 108లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అత్యవసర విభాగం డాక్టర్లు ఆమెకు వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉంది.
పీలేరురూరల్ : ద్విచక్రవాహనం అదుపు తప్పి యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన పీలేరు పట్టణంలోని యల్లమంద క్రాస్ వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా దొడ్డిపల్లెకు చెందిన ఎన్. వినోద్‌కుమార్ (35) ద్విచక్రవాహనంలో పీలేరుకు వస్తుండగా యల్లమంద క్రాస్ వద్ద ఆటోను ఓవర్‌టేక్ చేయబోయి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వినోద్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లారురు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మదనపల్లె టౌన్ : మండలంలోని చీకలబయలుకు చెందిన రైతు జి.నారాయణస్వామి గురువారం రాత్రి రోడ్డుదాటుతుండగా బైక్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించగా బాధితుడు కోలుకుంటున్నాడు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కళావెంకటరమణ చెప్పారు.
కటర్ కాలిమీద పడి వెల్డర్‌కు తీవ్రగాయాలు
కటర్ కాలిమీద పడి వెల్డర్‌కు తీవ్రగాయాలు


