● వైఎస్ జగన్ ముందుచూపుతో ఎత్తిపోతలకు శ్రీకారం
ముచ్చుమర్రి ప్రతిపాదన సరికాదు
కడప సెవెన్‌రోడ్స్: కరువు పీడిత రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీరు అందించడంలో ఎంతో కీలకమైన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నాటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టగా, నేటి కూటమి ప్రభుత్వం తెలంగాణ ఒత్తిళ్లకు తలొగ్గి చరమగీతం పాడింది. ప్రాణప్రదమైన ఈ పథకం పనులు ఆగిపోవడంపై రాయలసీమ వాసుల్లో తీవ్ర ఆందోళన, అభద్రత వ్యక్తమవుతున్నాయి. దీనిపై సమాధానం కరువైన ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కో ఎదురుదాడికి పాల్ప డుతోంది. రాయలసీమ జీవనాడి అయిన ఎత్తిపోతల పథకం పనులు చేపట్టి పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో గురువారం చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లడానికి సంసిద్ధమయ్యారు. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడుకు సమీపంలోని జూపాడు బంగ్లా వద్ద బహిరంగసభ నిర్వహించాలని వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ బహిరంగసభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై వైఎస్సార్‌సీపీ కడపజిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ న్యాయస్థానం జోక్యంతో అనుమతి వస్తుందనే తాము భావిస్తున్నామన్నారు. ఏది ఏమైనా తాము చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళతామన్నా రు. కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతుల్లో పోలీసు బలగాలను పంపి అడ్డుకుంటే ఎక్కడికక్కడ నిరసనలు, సభలు జరుగుతాయని స్పష్టం చేశారు.
‘సీమ’సాగునీటికే ఎత్తిపోతలు
ఓవైపు తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా దిండి, పాలమూరు–రంగారెడ్డి పథకాలను చేపట్టి 100 టీఎంసీల కృష్ణా నీటిని తరలించుకువెళుతోంది. అలాగే కల్వకుర్తిలో 25కుగాను 50 టీఎంసీల నీటిని తోడేస్తున్నారు. కృష్ణానదిపై ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టడంతో ఇంతకమునుపున్న 60 వరద రోజులు ప్రస్తుతం 30కి పడిపోయాయి. రాయలసీమలోని ఎస్‌ఆర్‌బీసీకి 19 టీఎంసీలు, తెలుగుగంగకు 40 టీఎంసీలు, కేసీ కెనాల్‌కు 10 టీఎంసీలు, చైన్నె తాగునీటికి 15 టీఎంసీలు, గాలేరు–నగరికి 38 టీఎంసీలు, సోమశిలకు 78 టీఎంసీలు, కండలేరుకు 68 టీఎంసీలు చొప్పున నీరు అవసరమవుతుంది. ఈ పరిస్థితుల్లో శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు 7 వేల క్యూసెక్కులు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. శ్రీశైలంలో 880 అడుగుల నీటిమట్టం ఉంటే తప్ప సీమ ప్రాజెక్టులకు సాగునీరు అందే వీలుండదు. ఈ నేపథ్యంలో 841 బెడ్‌లెవెల్‌లో ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఒక్కటే సీమ సాగునీటి అవసరాలు తీర్చలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం ఫోర్ షోర్‌లో 800 అడుగుల నుంచే రోజుకు మూడు టీఎంసీల నీటిని డ్రా చేసుకునేందుకు వీలుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలంలోని పోతిరెడ్డిపా డు హెడ్ రెగ్యులేటర్‌ను ఆనుకుని ఈ ఎత్తిపోతల పథకం ఉంది. సంగమేశ్వరం వద్ద నుంచి నీటిని తీసుకొచ్చి లిఫ్ట్ ద్వారా పోతిరెడ్డిపాడుకు దిగువన నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎస్‌ఆర్‌ఎంసీలో కలుపుతారు. ఈ పథకానికి సంబంధించి 2020 మే 5వ తేది ప్రభుత్వం జీఓఆర్‌టీ నెంబరు 203 విడుదల చేసింది. ఈ పథకాన్ని రూ. 3,825 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి నీటిని తీసుకొచ్చే ఇన్‌లెట్ కెనాల్ నిర్మించారు. అలాగే పంపుహౌస్, ఇతర నిర్మాణాలు దాదాపు 30 శాతం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో పూర్తయ్యాయి. ఈలోపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాయలసీమకు జీవనాడి అయిన ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు తిరుగులేని నిదర్శనం.
కరువు నేలపై జలసిరులు పారించాలనే సదాశయంతో వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు.. బీటలు వారిన చేలతో.. కంట కన్నీళ్లతో అలసిపోయిన రైతులకు మేలు చేయాలనే సంకల్పంతో నిధులు విడుదల చేశారు.. ఆయన ఆశయానికి బాబు సర్కారు తూట్లు పొడిచింది. సీమ జీవనాడైన సీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపేసి రైతు సంక్షేమానికి ‘నీళ్లొ’దిలింది.
ముచ్చుమర్రి వద్ద నుంచే లిఫ్ట్‌లు ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అనాలోచితంగా మాట్లాడుతున్నారని ‘సీమ’నేతలు మండిపడుతున్నారు. సీమ ఎత్తిపోతల నుంచి ఎస్‌ఆర్‌ఎంసీలోకి నీటిని తీసుకు రావడానికి దూరం నాలుగు కిలోమీటర్లే ఉంటుంది. కానీ ముచ్చుమర్రి నుంచి తీసుకు రావాలంటే సుమారు 50 కిలోమీటర్లు ఉంటుందని చెబుతున్నారు. ఇది అధిక వ్యయం, ప్రయాసతో కూడు కున్నది. సీమ ఎత్తిపోతల పథకం పనులను బా బు సర్కార్ చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
అక్రమ నీటి వాడకంతో తగ్గిన వరద రోజులు
దిండి, పాలమూరు–రంగారెడ్డితో నీటిని తోడేస్తున్న తెలంగాణ
బాబు అండ్ కో కుతంత్రాలతో ఆగిన ‘సీమ’ఎత్తిపోతల పనులు
నేడు వైఎస్సార్ సీపీ చలో పోతిరెడ్డిపాడు
● వైఎస్ జగన్ ముందుచూపుతో ఎత్తిపోతలకు శ్రీకారం
● వైఎస్ జగన్ ముందుచూపుతో ఎత్తిపోతలకు శ్రీకారం
● వైఎస్ జగన్ ముందుచూపుతో ఎత్తిపోతలకు శ్రీకారం


