పేకాట రాయుళ్ల అరెస్ట్
పుంగనూరు : పట్టణంలోని దోబికాలనీలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ అన్సర్‌బాషా తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముందుగా అందిన సమాచారం మేరకు దోబికాలనీలో దాడులు చేసి పేకాటరాయళ్ల నుంచి రూ.77 వేలు నగదు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
తంబళ్లపల్లె : ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం మండలంలో జరిగింది. పరసతోపు పంచాయతీ గోల్లపల్లివారిపల్లెకు చెందిన సదాశివరెడ్డి(46) ద్విచక్రవాహనంలో పనిగా తంబళ్లపల్లెకు బయలుదేరాడు. నల్లగడ్డబావి సమీపంలో బైక్ అదుపుతప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తించిన స్థానికులు వైద్య చికిత్సల కోసం స్థానిక సీహెచ్‌సికి తరలించారు. పరిిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు.
మట్టిట్రాక్టర్ కిందపడి
కూలీ దుర్మరణం
మదనపల్లె టౌన్ : కూలిపనులకు వెళ్లి ఓ వ్యక్తి కానరాని లోకాలకు వెళ్లిన విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ముదివేడు ఎస్‌ఐ మధురామచంద్రుడు, మృతుడి కుటుంబీకుల కథనం మేరకు.. మదనపల్లె మండలం, కోళ్లబైలు పంచాయతీ, బయారెడ్డికాలనీలో నివాసం ఉంటున్న వెంకటరెడ్డి కొడుకు రెడ్డిశేఖర్(40), రోజు మాదిరిగానే బుధవారం తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కరుబలకోట మండలం, ముదివేడు వద్ద ట్రాక్టర్‌కు మట్టిలోడు చేసేందుకు సహచరులతో వెళ్లాడు. అక్కడ ట్రాక్టర్‌కు మట్టిలోడు చేసి, ట్రాలీపై కూర్చొని వెళ్తుండగా ప్రమాదవశాత్తు ముదివేడుకు సమీపంలోని మలుపు వద్ద ట్రాక్టర్ కిందపడ్డాడు. దీంతో ట్రాక్టర్ చక్రాలు రెడ్డిశేఖర్‌పై వెళ్లగా తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. స్థానికులు బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి వైద్యం అందించేలోపే మృతిచెందాడు. రెడ్డిశేఖర్‌కు భార్య, పిల్లలు ఉన్నారు.
బద్వేలు అర్బన్ : మండల పరిధిలోని అనంతరాజుపురం పంచాయతీ లక్ష్మీపాలెం గ్రామంలోని పురాతన శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో 15 ఏళ్లుగా భద్రపరిచిన స్వామి ఆభరణాలకు బుధవారం అధికారులు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో పంచానామా నిర్వహించారు. 15 ఏళ్ల క్రితం స్వామివారి ఆభరణాల్లో కొన్ని చోరీకి గురయ్యాయి. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను గుర్తించి ఆభరణాలు రికవరీ చేశారు. అప్పటి నుంచి వీటిని బయటకు తీయకుండా అలాగే ఉంచారు. త్వరలోనే స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో పాలక మండలి సభ్యులు స్వామివారి ఆభరణాలకు పంచనామా నిర్వహించాలని ఉన్నతాధికారులకు విన్నవించారు. ఈ మేరకు ఆలయ ఆవరణలో పంచనామా నిర్వహించారు. పంచనామా అనంతరం ఆభరణాలను తిరిగి ఆలయంలోని పెట్టెలోనే భద్రపరిచి సంరక్షించనున్నట్లు అధికారులు తెలిపారు.


