ఆలకించండి... ఆదుకోండి | - | Sakshi
Sakshi News home page

ఆలకించండి... ఆదుకోండి

Feb 3 2026 7:27 AM | Updated on Feb 3 2026 7:27 AM

ఆలకించండి... ఆదుకోండి

ఆలకించండి... ఆదుకోండి

ప్రజాసమస్యలపై

కలెక్టరేట్‌కు పోటెత్తిన ప్రజలు

మదనపల్లె రూరల్‌ : ‘సమస్యల పరిష్కారం కోసం రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాం. అధికారులు అర్జీలు తీసుకుంటున్నారు. గడువులోపు పరిష్కరిస్తాం వెళ్లండి అంటూ పంపేస్తున్నారు. అయినా మా సమస్యలు తీరడం లేదు. కనీసం మీరైనా మా బాధలు అర్థం చేసుకుని పరిష్కరించండయ్యా’ అంటూ కలెక్టరేట్‌కు వివిధ సమస్యలపై అర్జీదారులు పోటెత్తారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మతో పాటు సబ్‌ కలెక్టర్‌ చల్లా కల్యాణి, డీఆర్‌ఓ మధుసూదనరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇందులో చాలా మంది పెన్షన్‌ కోసం అర్జీలు అందజేశారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై జాయింట్‌ కలెక్టర్‌, సంబంధిత అధికారులను అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు.

అర్జీల్లో కొన్ని....

మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ పరిధిలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వభూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. గతంలో రద్దైన పట్టాతో ప్రస్తుతం ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారన్నారు. రెవెన్యూ అధికారులకు ఈ విషయం తెలిసినా కబ్జాదారులతో కుమ్మక్కై మౌనంగా ఉంటున్నారని అందులో పేర్కొన్నారు.

ప్రభుత్వ స్థలంలో కారు పార్క్‌ చేసి వెళితే, ఆ స్థలానికి ఎటువంటి సంబంధం లేని జనసేన నాయకులు మైఫోర్స్‌ మహేష్‌, ఉమేష్‌ తనపై అకారణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోటకు చెందిన ఎం.ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీకి చెందిన ప్రభుత్వస్థలాన్ని జనసేన నాయకుల ఆక్రమణ నుంచి స్వాధీనం చేసుకోవాలని, స్థానికులకు వీరి నుంచి రక్షణ కల్పించాలని కోరారు.

నవోదయం–2 కార్యక్రమంలో భాగంగా నాటుసారా తయారీ, విక్రయాలు మానేస్తే జీవనోపాధి కల్పిస్తామన్న ఎకై ్సజ్‌ అధికారుల మాటలు నమ్మి పూర్తిగా వదిలేశామని, ఏళ్లు గడుస్తున్నా అధికారు లు ఇప్పటివరకు తమకు న్యాయం చేసిన దాఖలా లేదని మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ తుమ్మలతాండాకు చెందిన ప్రజలు అర్జీ సమర్పించారు. ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా గొర్రెలు, ఆవులు, ఆటోలు సబ్సిడీ ద్వారా ఇప్పిస్తే బాగుపడుతామని విన్నవించారు.

కష్టపడి సంపాదించుకున్న నగదు, బంగారాన్ని పరిచయస్తులైన వ్యక్తులను నమ్మి అప్పుగా ఇస్తే..తిరిగి ఇవ్వకపోగా పైపెచ్చు తనపైనే దాడిచేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని మదనపల్లె పట్టణం చీకలగుట్టకు చెందిన హిజ్రా స్వాతి ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదుచేసినా తనకు న్యాయం జరగలేదని, తనకు రక్షణ కల్పించాల్సిందిగా వేడుకుంది.

మదనపల్లె పట్టణం అప్పారావుతోట, సైదాపేట, కౌసర్‌ మసీదు తదితర ప్రాంతాల్లో నివసించే వ్యక్తులను ఇబ్బంది పెడుతూ, రాకపోకలకు వినియోగిస్తున్న దారిలో గుంతలు తవ్వి ఎవ్వరినీ రానివ్వకుండా అడ్డుకుంటున్నారని మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ నూర్‌ఆజం, కౌన్సిలర్‌ బి.ఏ.ఖాజా కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement