తల్లిదండ్రులను గెంటేసిన కొడుకు
● ఇంటి బయట దీనంగా కూర్చున్న
వృద్ధదంపతులు
● సీఐ జోక్యంతో సమసిన వివాదం
రాయచోటి టౌన్ : తల్లిదండ్రుల వృద్ధాప్యం వారిని కొడుకు చాటు బిడ్డల్లాగా చేసింది..వృద్ధాప్యంలో కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన కొడుకు, కోడలు వారిపట్ల విసుగు చెందడం మొదలెట్టారు.. ఫలితంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న తల్లిని.. తండ్రిని ఇంటి నుంచి బయటకు పంపేశారు.. కొడుకును వదల లేక.. ఉన్న ఇంటి నుంచి దూరం కాలేక వీధిలోనే ఇంటి బయట దీనంగా కూర్చున్నారు.. గ్రామస్తులు సద్దు చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.వివరాలు.. రాయచోటి రూరల్ మండలం సిబ్యాల గ్రామానికి చెందిన సుబ్బరాయుడు తన తండ్రి సుబ్బరాయుడు, తల్లి నాగమ్మలను సోమవారం ఇంటి నుంచి వెలగొట్టాడు. పేగు తెంచుకున్న బిడ్డ అమ్మ నాన్నలను బయటకు నెట్టి వేసిన సంఘటన గ్రామస్తులను కలిసి వేసింది. విషయాన్ని సోషల్ మీడియా ద్వారా గ్రామస్తులు బయటకు తెచ్చారు. తల్లిదండ్రులను కొడుకు, కోడలు ఇంటి నుంచి గెంటేశారన్న సమాచారం మీడియా, సోషల్ మీడియా ద్వారా రాయచోటి అర్బన్ పోలీసులకు చేరింది. వెంటనే స్పందించిన అర్బన్ సీఐ బివి చలపతి సిబ్బందిని గ్రామానికి పంపి అమ్మ నాన్నలను, కొడుకు, కోడలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పోషించడంతో పాటు వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత బిడ్డలదేనని చెప్పారు. వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని సీఐ హెచ్చరించారు. పోలీసులు ఆదేశాల మేరకు తప్పును తెలుసుకున్న వెంకటరమణ అమ్మా నాన్నలను బాగా చూసుకుంటానని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి వెళ్లారు. పోలీస్ చర్యలను స్థానికులు అభినందిస్తున్నారు.


