వర్గ పోరా! ఆధిపత్య ఆరాటమా?
● జిల్లా కేంద్రం అయ్యాక మదనపల్లెలో టీడీపీ బల ప్రదర్శనలు
● రెండువర్గాలుగా విడిపోయిన నాయకులు
మదనపల్లె : అన్నమయ్య జిల్లా టీడీపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాయచోటి కేంద్రంగా ఒక రకమైన రాజకీయ పరిస్థితులు ఉండగా, ఇప్పుడు మదనపల్లె జిల్లా కేంద్రం కావడంతో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాలు మారిపోతున్నాయి. నిన్నటిదాకా ఉప్పు–నిప్పుగా ఉన్న ఎమ్మెల్యేల మధ్య విభేదాలు, వర్గపోరు ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయి. దీనికి మదనపల్లె వేదికగా మారింది. ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఈ విషయం గతనెల 23న జరిగిన పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పర్యటన, ఆదివారం జరిగిన మంత్రి మండిపల్లి పర్యటనతో స్పష్టమైంది. దీనికి తగినట్టు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా రెండు వర్గాలుగా మారిపోతున్నారు.
కిషోర్ తో జతకట్టిన జహా, ప్రసాద్
గత నెల 23న పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మదనపల్లెకు వచ్చారు. ఆయన రాక సందర్భంగా ఎప్పుడూ లేని విధంగా హడావిడి జరిగింది. పట్టణంతోపాటు, ఆయన విడిది చేసిన ఆర్ అండ్ బి బంగ్లా వద్ద భారీగా స్వాగత ఫ్లెక్సీలు పెట్టారు. భారీ స్థాయిలో టపాకాయలు కాల్చి హడావుడితో బలప్రదర్శన చేశారు. ఆర్‌అండ్బీ బంగ్లాకు వచ్చిన కిషోర్ కుమార్ రెడ్డిని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల నాయకులు కలిశారు. వారికి అండగా నేనుంటానని భరోసా ఇచ్చారు. కిషోర్ కిషోర్ వెంట రాజంపేట జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ ఉండగా, కొంతసేపటి తర్వాత స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా కలిశారు. ముగ్గురు కలిసి పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మాట్లాడారు. వారానికి ఒకరోజు ఇక్కడ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని కిషోర్ ప్రకటించారు. టిడిపి నేతలు మినహా జనసేన, బిజెపి నేతలు ఇటువైపు రాలేదు.
ఇప్పుడు మంత్రి..
మదనపల్లె జిల్లా కేంద్రం అయ్యాక మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదివారం మదనపల్లె వచ్చారు. ఆయన రాక కోసం టీడీపీలోని ఓ వర్గం హడావుడి చేసింది. బ్యానర్లతో స్వాగతం పలికారు. పట్టణంలో కార్లు, బైక్ ర్యాలీగా మంత్రితో ప్రదర్శన చేశారు. ఆయనతో పుంగనూరు ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి, స్థానిక జనసేన నేతలు, టీడీపీ ముఖ్య నాయకులు వెంట ఉన్నారు. మీడియా సమావేశంలో మంత్రి కూడా వారానికి ఒకరోజు మదనపల్లెలో ఉంటానని ప్రకటించారు. దీంతో ఈ రెండు వర్గాలు మదనపల్లెలో ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నట్లు కనిపిస్తోంది.
వర్గాలుగా చీలిపోయారు?
టీడీపీ ఎమ్మెల్యేల మధ్య వర్గపోరులో పైచేయి ఎవరిది అన్న చర్చ పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, ఎమ్మెల్యేలు కిషోర్, షాజహాన్ ఓ వర్గంగా జతకట్టడం స్పష్టమైంది. దీనివల్లే ఎమ్మెల్యే మంత్రి పర్యటనకు దూరంగా ఉన్నారని తెలుస్తున్నప్పటికీ, ఎమ్మెల్యేకు మంత్రి పర్యటన సమాచారం ఇవ్వలేదని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. అయితే ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు మంత్రి వైపు వెళ్లారు. దీంతో మండిపల్లికి ఎమ్మెల్యే దూరం కావడం సహజమే. మంత్రి కూడా మదనపల్లెలో తన ప్రభావాన్ని చూపించుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గాలతో పాటు, జనసేన నేతలు ఆయనతో కలిసి రావడం కూటమి నేతల మద్దతు ఉందని చాటి చెప్పే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఐదు నియోజకవర్గాల్లో పుంగనూరు, తంబళ్లపల్లెలో వైఎస్‌ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉండగా, ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఓడిపోయిన అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి ఉండగా, మంత్రి పదవితో మండిపల్లికి అధికార బలం తోడైంది. కిషోర్, షాజహాన్ బాషాలతో జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ కలవడం ఈ వర్గానికి పార్టీపరంగా బలం తోడైనట్టు భావించాలి. తంబళ్లపల్లె ఇంచార్జ్ ఎవరు లేకపోవడంతో దీనికి ఏ వర్గమూ లేదు.
నాలుగు రోజులుగా కసరత్తు
మదనపల్లె జిల్లా కేంద్రం కావడంతో దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే నిర్వహించిన ర్యాలీ, ఇతర కార్యక్రమాలకు కిషోర్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. అలాగే గత నెల 23న నాటి పర్యటనను దృష్టిలో ఉంచుకొని మంత్రి వర్గీయులు మదనపల్లెలో తమ సత్తా నిరూపించాలని భావించినట్లు తెలుస్తోంది. దీనికోసం నాలుగు రోజులుగా కసరత్తు చేసినట్టు తెలిసింది. కిషోర్ పర్యటనకు మించి బలప్రదర్శన చేయాలన్న లక్ష్యంగా ఈ కార్యక్రమంలో నిర్వహించినట్టు తెలుస్తోంది. కాగా ఎమ్మెల్యే షాజహాన్ బాష జన్మదిన వేడుకల్లో బిజీగా ఉన్న రోజే మంత్రి వర్గీయులు మదనపల్లెలో బల ప్రదర్శనకు చేయడం చర్చనీయాంశమైంది.


