కిడ్నీ రాకెట్ కేసులో పెరుగుతున్న నిందితులు
మదనపల్లె : అన్నమయ్య జిల్లా మదనపల్లె కేంద్రంగా కొనసాగిన కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు..ఈ కేసులో ప్రమేయం ఉన్న నిందితులపై కేసులు నమోదు చేస్తూనే దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. గతేడాది నవంబర్ 9న విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం బొడ్డపాళెంకు చెందిన సాడి యమున (29) శరీరం నుంచి స్థానిక గ్లోబల్ మల్టీ స్పెషాలిటి హాస్పటిల్‌లో కిడ్నీని తొలగించి మరొకరికి అమర్చారు. కిడ్నీ ఇచ్చిన యమున ..నవంబర్ 10న మృతి చెందింది. దీనిపై తల్లి సూరమ్మ ఫిర్యాదుపై కేసు నమోదుచేసి స్థానిక టూటౌన్ పోలీసులు మొదటి దఫాలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా కేసు దర్యాప్తును ఆపకుండా కొనసాగిస్తూ వస్తున్నారు. దాంతో పోలీసులకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నట్టు చెబుతున్నారు.
22కి పెరిగిన నిందితులు
సాడి యమున మృతిపై తొలుత ఈ కేసులో నేరుగా ప్రమేయం, మృతి కారణమైన నిందితులతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏ–1గా గత డీసీహెచ్‌ఓ ఆంజనేయులు, తర్వాత వరుసగా నిందితులను చేర్చారు. దర్యాప్తు సాగిస్తూనే ఇప్పటి వరకు 22 మందిని నిందితుల జాబితాలో చేర్చారు. వీరిలో ఆంజనేయులు కుటుంబీకులతోపాటు, వైద్య, ఆరోగ్యశాఖ నివేదిక ఆధారంగా ఆస్పత్రి నిర్వాహకురాలిని కేసులో చేర్చారు. ఇప్పటికి 22 మంది నిందితుల్లో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారిని అరెస్ట్ చేయనుండగా. దర్యాప్తు మరింత లోతుగా వెళ్లడంతో కిడ్నీ దాతలు, స్వీకరించిన వ్యక్తులకు మధ్యవర్తలు ఎవరు, ఎక్కడి వారన్న వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే కొందరి సమాచారం అందడంతో కొత్తగా మరో ఇద్దరు లేక ముగ్గురిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
వాళ్లతో లింకు ఎలా
మృతి చెందిన సాడి యమున, మరో మహిళ నుంచి తీసుకున్న కిడ్నీల వ్యవహారంలో తెరవెనుక ఉన్న మరికొందరు మధ్యవర్తులు, చికిత్స చేసిన సమయంలో సహకరించిన మరొకొందరు ప్రయివేటు వైద్య సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు. మధ్యవర్తులు, వైద్య సిబ్బంది కోస్తా, రాయలసీమకు చెందిన వాళ్లునట్టు పోలీసులు గుర్తించారు. ప్రధానంగా కిడ్నిలు అమర్చిన వ్యక్తులను ఎవరు గుర్తించారు, వారిని సంప్రదించింది ఎవరు, వారి మధ్య జరిగిన వ్యవహరాలపై ఆరా తీస్తున్నారు. దీంతో ఈ కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తు మరింత లోతుగా సాగుతోంది.


