కుక్కల దాడిలో 96 గొర్రెల మృతి
పెద్దతిప్పసముద్రం : మండలంలోని పోతుపేట పంచాయతీడుంవారిపల్లిలో శనివారం అర్ధశువుల కొట్టంలో సేద తీరుతున్న గొర్రెల మందపై 20 ఊర కుక్కలు దాడికి దిగాయి. ఈ ఘటనలో 96 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వివరాల్లోకి వెళితే పిడుంవారిపల్లికి చెందిన పశుకాపరి తంబళ్ళపల్లి నాగరాజు, అక్కులమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. గొర్రెలను మేపుకోవడం వీరి జీవనాధారం. గొర్రెలను మేపుకుంటూనే పశు కాపరి ముగ్గురు కుమార్తైలెన అనూరాధ, శారద, కవితలకు వివాహం చేశాడు.కమార్తె గీత చిత్తూరులో ఫార్మసీ చదువుతోంది. ఒక్కగానొక్క కుమారుడు కర్నూల్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఈ తరుణంలో ఊరకుక్కలు ఒక్కసారిగా వచ్చి గొర్రెల గొంతు, కడుపు, కాలు భాగాలకు కాటు వేయడంతో 96 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలో బాధిత రైతు రూ.7 లక్షలకు పైగా నష్టపోయాడు. ఘటనా స్థలం వద్దకు చేరుకున్న నాగరాజు మృతి చెందిన గొర్రెలను చూసి ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. తోటి రైతులు సైతం బాధిత రైతును ఓదార్చారు. గొర్రెలనే నమ్ముకున్న తాను జీవనాధారం కోల్పోయానని ప్రభుత్వం తనను ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని రైతు కంటతడి పెట్టాడు.


