దౌర్జన్యంగా ఉలవ పంట కోశారని ఫిర్యాదు
రొంపిచెర్ల : తళితుని పొలంలో ఉలవ పంటను అగ్రవర్ణాల వారు దౌర్జన్యంగా పెరికేశారని బాధితుడు రొంపిచెర్ల పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రొంపిచెర్ల మండలం చిచ్చిలివారిపల్లె గ్రామ పంచాయతీ గాజులపల్లెకు చెందిన దళితుడు శ్రీనివాసులు తన భూమిలో ఉలవ పంటను సాగు చేశాడు. అయితే అ భూమిలో అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణా కులానికి చెందిన మునిరామయ్య, మంగమ్మ ఉలవ పంటను కోశారని తెలిపారు. ఇదేమని అడిగితే అడ్డు వస్తే నిన్ను చంపేస్తామని బెదిరించారన్నారు. తన భూమిని వారి పట్టాదారు పుస్తకంలో నమోదు చేసుకున్నారన్నారు. దీనిపై కోర్టులో కేసు కూడా వేశామన్నారు. ఈ భూమి తనదేనని హైకోర్టు కూడా తనకు అనుగులంగా తీర్పు ఇచ్చిందన్నారు. అయితే అగ్రవర్ణాల వారు నా కుటుంబాన్ని చంపేసి భూమిని కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తన కుటుంబానికి రక్షణ కల్పించి పంట కోసిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు శ్రీనివాసులు కోరుతున్నారు. సంఘటన స్థలాన్ని రొంపిచెర్ల పోలీసులు పరిశీలించి ఇరువర్గాలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. హైకోర్టు శ్రీనివాసులకు అనుకూలంగా తీర్పు ఇస్తే మీరు ఎలా భూమిలోకి పోతారని అగ్రవర్ణాల వారిని పోలీసులు ప్రశ్నించారు. దీనిపై రొంపిచెర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


