గంజాయి కేసులో కీలక నిందితుడి అరెస్ట్
పెద్దతిప్పసముద్రం : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి పంచాయతీ పెండ్లిమామిడి గ్రామానికి చెందిన బాలయ్య కుమారుడు కొర్రు అర్జున్ (35) అనే నిందితుడు రెండు కిలోల గంజాయితో పోలీసులకు పట్టుబడ్డాడు. ములకలచెరువు సీఐ వెంకటేశులు పర్యవేక్షణలో పీటీఎం ఎస్‌ఐ పరమేశ్ నాయక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు మండలాలకు సరిహద్దులోని సండ్రడవి అటవీ ప్రాంతంలో 2024 ఫిబ్రవరి 5న గంజాయి అక్రమ రవాణా ముఠా సభ్యులు పట్టుబడిన విషయం పాఠకులకు తెలిసిందే. అప్పట్లో వారి వద్ద లభించిన రూ.30 లక్షల విలువ చేసే 50 గంజాయి ప్యాకెట్లతోపాటు రెండు కార్లను పోలీసులు సీజ్ చేసారు. అప్పట్లో మదనపల్లికి చెందిన ఓబులేసు అనే వ్యక్తి తనకు 110 కిలోల గంజాయి కావాలని చెప్పడంతో నిందితుడు అర్జున్ రూ.లక్ష అడ్వాన్సుగా తీసుకుని గంజాయిని ఓబులేసుకు అందజేశాడు. మిగిలిన పైకం ఇవ్వాలని అర్జున్ డిమాండ్ చేయగా గంజాయి విక్రయించాక ఇస్తామని ఓబులేసు చెప్పడంతో మిన్నకుండిపోయాడు. అప్పటి నుంచి ఓబులేసు కోసం అర్జున్ తచ్చాడుతుండగా శనివారం ములకలచెరువు రైల్వేస్టేషన్ వద్ద పోలీసుల కంట పడ్డాడు. పోలీసుల తనిఖీలో అర్జున్ రెండు కిలోల గంజాయితో పట్టుబడగా, అతన్ని అరెస్టు చేశారు.


