ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు
చౌడేపల్లె : అతివేగంగా వెళ్తున్న ఆటో అదుపు తిప్పి బోల్తా పడిన ఘటన మండలంలోని గడ్డంవారిపల్లె మార్గంలో గల దొడ్డిగాని దేవళం సమీపంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చౌడేపల్లె నుంచి పరికిదొనకు ఆటోలో ఆరుగురు ప్రయాణికులు వెళ్తుండగా దొడ్డిగాని దేవళం సమీపంలో గల మలుపు వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో చౌడగానిపల్లెకు చెందిన లక్ష్మమ్మ(62), పరికిదొనకు చెందిన రెడ్డప్ప(67)లు తీవ్రంగా గాయపడగా, పరికిదొనకు చెందిన కాటమన్న(45), వెంకటమ్మ(48), ప్రవీణ్‌కుమార్(30), గడ్డంవారిపల్లెకు చెందిన రమణమ్మ(47)గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో చౌడేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్సలు అందించారు. లక్ష్మమ్మ, రెడ్డెప్పలను మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


