ఆటో బోల్తా: 12 మందికి గాయాలు
చౌడేపల్లె : ఆటో బోల్తాపడిన ప్రమాదంలో 12మందికి గాయాలైన ఘటన అన్నమయ్య జిల్లా బోయకొండ గంగాపురం వద్ద ఉన్న చెక్‌పోస్టు సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది.వివరాలు.. బాపట్ల జిల్లా రేపల్లె, భట్టిప్రోలు మండలం పల్లికోన నుంచి వచ్చిన వలస కూలీలు అన్నమయ్య జిల్లా సోమల మండలం కందూరు సమీపంలో కొటగుండ్లపల్లెకు చెందిన ఓ రైతు వద్ద పనులకోసం పదిరోజుల కిందట వచ్చారు. శుక్రవారం పనులకు విరామం ఇవ్వడంతో పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలంలోని బోయకొండ గంగమ్మను దర్శించుకునేందుకు వీరు ఆటోలో బయలుదేరారు. మళ్లీ అదే ఆటోలో తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆటోలోని 12 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుకొండలు(45), వెంకటేశ్వరమ్మ(38), విజయ్(40), అనితమ్మ(55), వీరమ్మ(55), మాధవి(38), శివరామకృష్ణ(45)లకు తీవ్రగాయాలయ్యాయి. మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకొన్న ఈఓ ఏకాంబరం ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి 108 సహాయంతో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ నాగేశ్వరరావు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఏటవాలుగా ఉన్న మార్గంలో ఆటోలు పూర్తిగా నిషేధం. ఈ మార్గంలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌ను ఎస్‌ఐ అదుపులోకి తీసుకున్నారు.
క్షతగాత్రులు బాపట్ల జిల్లా రేపల్లె, పల్లికోన వాసులు


