తరిగొండ పాఠశాలకు హరిత అవార్డు
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ జెడ్పీ హైస్కూల్‌కు జాతీయ హరిత పాఠశాలల అవార్డు వచ్చింది. న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 2025–2026 ఏడాదికి గానూ గ్రీన్‌స్కూల్ ప్రోగ్రామ్ అవార్డుకు తరిగొండ జెడ్పీ హైస్కూల్ ఎంపికయ్యింది. ఈ అవార్డు కోసం మన రాష్ట్రం నుంచి మొత్తం 39 పాఠశాలలు దరఖాస్తు చేసుకొన్నాయి. అందులో 11 జెడ్పీ హైస్కూళ్లు ఈ అవార్డుకు ఎంపికయ్యాయి. కాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే 7 జెడ్పీ హైస్కూళ్లు ఈ అవార్డుకు ఎంపిక కావడం గమనార్హం. తరిగొండ జెడ్పీ హైస్కూల్లో 2025–2026 ఏడాదికి గానూ మొత్తం 1200 మొక్కలు నాటి పర్యావరణ హిత కార్యక్రమాలు చేపట్టడంతో ఈ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ సంస్థ న్యూఢిల్లీలోని లోధిరోడ్‌లో స్టెయిన్ ఆడిటోరియంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ సునీతా సురైన్ చేతుల మీదుగా జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ రామచంద్ర, గ్రీన్ టీచర్ కిషోర్‌కుమార్, విద్యార్థులు నందివర్థన్, ధనుష్‌కుమార్‌రెడ్డిలు అవార్డు అందుకొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు గ్రీన్ స్కూల్ అవార్డు రావడం పట్ల రాష్ట్ర ఎన్జీసీ కోఆర్డినేటర్ నీలకంఠ, జిల్లా ఎన్జీసీ కోఆర్డినేటర్ శివలక్ష్మీ, పాఠశాల సిబ్బంది ఆభినందించారు.


