కేంద్రీయ విద్యాలయానికి భూ కేటాయింపు
● ఫలించిన ఎంపీ మిథున్‌రెడ్డి కృషి
● వచ్చే ఏడాది తరగతుల ప్రారంభంపై ఆశలు
మదనపల్లె : మదనపల్లెలో ప్రతిష్టాత్మక కేంద్రీయ విద్యాలయానికి భూమి కేటాయించేందుకు ఎట్టకేలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విద్యా కేంద్రం ప్రారంభించాలని రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి పలుమార్లు కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నోసార్లు వినతిపత్రాలను ఇవ్వడమేకాక ప్రత్యక్షంగా మంత్రులు, అధికారులను కలిసి విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. నిరుపేద విద్యార్థులు అధికంగా ఉన్న ఈ ప్రాంతానికి కేంద్రీయ విద్యాలయం ఆవశ్యకతను వివరించారు. దీనితో కేంద్రీయ విద్యాలయ ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వానికి, అన్నమయ్యజిల్లా కలెక్టర్‌కు లేఖలు రాశారు. 2026–27 విద్యా సంవత్సరం దగ్గరపడుతోంది, మాకు కేటాయించిన భూమిని అప్పగించండి అంటూ విన్నవించారు. తర్వాత ఇదే విషయంపై గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్‌ను మిథున్‌రెడ్డి కలిశారు. కేంద్రీయ విద్యాలయాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఈ పరిస్థితుల్లో భూమి అప్పగింత వ్యవహారంపై కేంద్రంలో కదలిక వచ్చింది. ఫలితంగా ఈనెల 28న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కేంద్రీయ విద్యాలయానికి ఉచితంగా 6.09 ఎకరాలను అప్పగించేందుకు తీర్మానించారు. ఇక మదనపల్లె–పుంగనూరు రహదారిలో వలసపల్లె వద్ద సర్వే నంబర్లు 713/3, 713/4, 496/2, 496/3లో 6.09 ఎకరాల భూమిని కేంద్రీయ విద్యాలయానికి అప్పగించేందుకు చర్యలు వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం అవుతాయన్న ఆశలో తల్లిదండ్రులు, విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.


