ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణకు ఉద్యమం
మదనపల్లె : ఉపాధి హామీ చట్టం పునరుద్ధరించాలని కోరుతూ ఫిబ్రవరి 1 నుంచి 8 వరకు గ్రామాల్లో ప్రచారాలను నిర్వహిస్తున్నట్టు సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మహేష్, సహాయ కార్యదర్శి కృష్ణప్ప అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణకు సీపీఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కలిసి ఆందోళన కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. ప్రతి కూలీకి పని కల్పించాలని ఉద్దేశంతో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ వచ్చిందన్నారు. ఇప్పుడు కూలీలకు నష్టం చేసే వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మిగులు భూములు ప్రజలవని అది పేదలకు దక్కాలని అన్నారు. మంత్రి లోకేష్ ఆస్తులను ఎకరా 99 పైసలకే ఇచ్చుకోవచ్చని, ప్రభుత్వ భూములు ఇవ్వరాదని అన్నారు.రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై మహిళ ఉద్యోగి చేస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ నాయకులు మురళి, రెడ్డిశేఖర్ పాల్గొన్నారు.


