హార్సిలీ హిల్స్ అభివృద్ధికి నీళ్లొదిరారు !
అమలుకు నోచుకోని తీర్మానాలు
● మూతపడిన మినరల్ వాటర్‌ప్లాంట్
● పడకేసిన పారిశుధ్య పనులు
● హార్సిలీహిల్స్ టౌన్‌షిప్ కమిటీ
సమావేశాల ఊసేలేని వైనం
బి.కొత్తకోట : మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్‌లో అభివృద్ధి ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఒక్కటంటే ఒక్క హార్సిలీహిల్స్ టౌన్‌షిప్ కమిటీ సమావేశం కూడా జరగలేదు. అసలు కమిటీని అధికారులు మరచిపోయారా అనే స్థితి నెలకొంది. దీంతో గత ప్రభుత్వంలో చేపట్టిన పనులు మూతబడ్డాయి, పారిశుద్ధ్య నిర్వహణ, పాలనాపరమైన చర్యలు కనుమరుగయ్యాయి. కొండపై ఆక్రమణలు, అక్రమాలపై కన్నెత్తి చూసే పరిస్థితి కరువైంది.
హార్సిలీహిల్స్ టౌన్‌షిప్ 2000లో ఏర్పాటైంది. దీనికి మదనపల్లె సబ్ కలెక్టర్ చైర్మన్, ఇతర డివిజన్ స్థాయి అధికారులు సభ్యులు, స్థానికులకు ముగ్గురు సభ్యులుగా చోటు కల్పించారు. ఈ కమిటీ తరచూ సమావేశాలు నిర్వహించి ఇక్కడి సమస్యలు, అభివృద్ధిపై సమీక్షించి చర్యలు తీసుకోవాలి. సభ్యుల సూచనలు, సలహాలు తీసుకోవాలి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా ఏర్పడ్డాక హార్సిలీహిల్స్ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మదనపల్లె ఆర్డీఓ, కలెక్టర్‌లు స్వయంగా పర్యవేక్షించడంతో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కూటమి పాలన వచ్చి 18 నెలలైనా ఇప్పటిదాక ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు.
వాటర్ ప్లాంట్ మూత
స్విమ్మింగ్‌పూల్ వద్ద పర్యాటకులకు ఐదు రూపాయాలకే మినరల్ వాటర్ అందించేలా 2022లో అప్పటి కలెక్టర్ గిరీషా హార్సిలీహిల్స్‌పై మినరల్ వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. నిర్వహణ బాధ్యతను గ్రామీణ నీటి సరఫరా విభాగానికి అప్పగిస్తూ ఆదేశించారు. దీన్ని ప్రారంభించిన తర్వాత ఎంతో ఉపయోగంగా ఉండేది. తర్వాత గాలికి వదిలేయడంతో మూతపడింది. పర్యాటకులకు నీళ్లులేక బాటిల్ నీటిని రూ.20 పెట్టి కొంటున్నారు.
పారిశుధ్య నిర్వహణ లేదు
సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా 2022లో గత కలెక్టర్ గిరీషా, ఆర్డీఓ, మురళీలు చెత్త, ఖాళీబాటిళ్లు వ్యర్థాలను తొలగించేలా పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. ప్రతిరోజూ కొండపై చెత్త, చెదారాన్ని సేకరించి తరలించేవారు. కూటమిపాలన మొదలయ్యాక పారిశుద్ధ్య పనులు ఆగిపోయాయి. చెత్త, చెదారం..మద్యం బాటిళ్లు రోడ్లపై, ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. తొలగించేందుకు కార్మికులు లేకపోవడంతో నిర్వహణ పూర్తిగా పడకేసింది.
వెలగని లైట్లు
గత ప్రభుత్వంలో రూ.14 లక్షల ఖర్చుతో హైమాస్ లైట్లను ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని వారి భధ్రత కోసం గాలిబండ, జిడ్డు సర్కిల్, రెవెన్యూ అతిథిగృహం, ఏనుగుమల్లమ్మ ఆలయం వద్ద హైమాస్ లైట్లను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ కూడా కరువైంది. లైట్లు వెలగక చీకట్లు నెలకొంటున్నాయి.
గాలిబండపై వ్యూ పాయింట్, షాపింగ్ కాంప్లెక్స్, సందర్శకులకు ప్రమాదం జరగకుండా ఫెన్సింగ్ పనులకు రూ.30 లక్షల అంచనాతో పనులు
పర్యావరణ పరిరక్షణకు కొండపై సందర్శకులు తిరిగేందుకు త్వరలో ఐదు ఈవీ కార్లు, 50 బైక్‌లు
కొండపై టూరిజం శాఖ సరఫరా చేస్తున్న తాగునీటికి మీటర్ల ఏర్పాటు, వినియోగం బట్టి చార్జ్ వసూలు
హార్సిలీహిల్స్‌పై పర్యవేక్షణ, విధుల నిర్వహణకు ప్రత్యేకంగా ఒక పరిపాలనా అధికారి నియామకం
సామూహిక మరుగుదొడ్లు నిర్మాణం, స్పోర్ట్స్ మైదానంలో పార్కింగ్ ఏర్పాటుకు టెండర్లు
రూ.42 లక్షలతో ఉద్యానవనం, రోడ్లకు ఇరువైపులా మొక్కలు, పూలమొక్కల పెంపకం.
రోడ్లపై ఆక్రమణల తొలగింపులో నష్టపోయిన బాధితులకు 10 గదులతో వాణిజ్య సముదాయం నిర్మాణం
కొండపై ఏపని చేపట్టాలన్న కమిటీ ఆమోదం తప్పనిసరి లేదంటే కఠినచర్యలు
రెవెన్యూశాఖ కేటాయించిన భూములు సద్వినియోగం చేసుకోనిపక్షంలో తిరిగి స్వాధీనం
కోర్టుకేసుల్లోని భవనాలకు మినహా మిగిలిన అన్నిశాఖల భవనాలు, అతిథిగృహలు, టూరిజం భవనాలకు ఆస్తిపన్ను విధించి
ఇంటి నంబర్లు
కొండపై సందర్శకుల భధ్రత కోసం సీసీ కెమరాల ఏర్పాటు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడంపై నిషేధం
నిత్య పారిశుధ్య పనుల కోసం 8 మంది సిబ్బంది నియామకం, ప్లాస్టిక్ వాడకం నిషేధం
శని, ఆదివారాల్లో హార్సిలీకొండకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
ఘాట్‌రోడ్డులో ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు, సురక్షిత చర్యలు.
టౌన్‌షిప్ కమిటీ సమావేశాలను నిర్వహించి హార్సిలీహిల్స్‌పై ఏమి జరుగుతోంది, ఇక్కడి పరిస్థితులు ఏమిటి అన్నదానిపై సమీక్షించాల్సి ఉంది. తద్వారా ఇక్కడ చేపట్టాల్సిన చర్యలు, సమస్యల పరిష్కారంపై కృషి చేయాలి. గతంలోని కఠిన నిబంధనలు కొనసాగించి ఆక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులతో పాటు పర్యాటక ప్రేమికులు కోరుతున్నారు.
హార్సిలీ హిల్స్ అభివృద్ధికి నీళ్లొదిరారు !


