రోడ్లపై ఆక్రమణల తొలగింపునకు చర్యలు
కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లె రూరల్ : అన్నమయ్యజిల్లా కేంద్రం మదనపల్లె పట్టణంలో ప్రధాన రహదారుల్లో ఆక్రమణలు గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో తొలగింపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. మదనపల్లెలో పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు గురువారం కలెక్టరేట్‌లో ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, సబ్ కలెక్టర్ చల్లా కల్యాణితో కలిసి పట్టణంలోని ట్రాఫిక్ సమస్యపై అధికారులతో చర్చించారు. ప్రత్యామ్నాయ మార్గాల ప్రతిపాదన, బస్‌స్టాండ్‌లు మార్పు, ట్రాఫిక్ అధికంగా ఉన్న ప్రదేశాలు, ప్రస్తుత ట్రాఫిక్ పరిస్థితులు, బస్‌రూట్లు, పార్కింగ్ సమస్యలు, ఆక్రమణలు, వన్ వే సిస్టం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంగా మదనపల్లె ఏర్పాటయ్యాక, వాహనాలు, ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరిగాయన్నారు. దీంతో ట్రాఫిక్, రోడ్డు భద్రతా సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ట్రాఫిక్ రద్దీ వేళలను దృష్టిలో ఉంచుకుని సమస్య పరిష్కారానికి అధికారులు సరైన ప్రణాళిక రూపొందించాలన్నారు. బెంగళూరు రోడ్డు నెహ్రూ స్కూల్ ఉంచి సొసైటీ కాలనీ మీదుగా ఎన్‌టీఆర్ సర్కిల్ వరకు వాహనాలు మళ్లించేందుకు ముఖ్య రహదారుల్లో ఆక్రమణలు, విద్యుత్ స్తంభాలు, తీగలు తొలగింపుకు మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, పోలీస్, ఆర్టీసీ శాఖలు సమన్వయం చేసుకుని త్వరితగతిన పనులు చేపట్టాలన్నారు.
ట్రాఫిక్ డైవర్షన్....
చిత్తూరు బస్టాండ్‌ను పుంగనూరు రోడ్డులోని వై జంక్షన్ వద్ద ఏర్పాటుకు ప్రభుత్వభూములను గుర్తించి, సాధ్యాసాధ్యాలు పరిశీలించాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి కడప, అనంతపురం వైపునకు వెళ్లే వాహనాలను రద్దీ వేళల్లో పట్టణంలోకి అనుమతించకుండా, చౌడేశ్వరి కల్యాణమండపం నుంచి రామారావు కాలనీ, గొల్లపల్లె క్రాస్ మీదుగా వెళ్లేలా చూడాలన్నారు. మల్లికార్జున సర్కిల్ నుంచి ఎంఎస్‌ఆర్ థియేటర్ రోడ్డు మీదుగా బెంగళూరు బస్టాండ్ వరకు, చిత్తూరు బస్టాండు నుంచి హెచ్‌పీ గ్యాస్ ఆఫీసు మీదుగా చెంబకూరు రోడ్డు వరకు, సీటీఎంరోడ్డు మంజునాథ స్వామి ఆలయం నుంచి బర్మావీధి, కలెక్టరేట్ మీదుగా చిత్తూ రు బస్టాండ్‌కు వన్ వేగా నిర్ణయించారు. సీటీఎం రో డ్డు, బెంగళూరు బస్టాండ్, సొసైటీ కాలనీ నో పార్కింగ్ జోన్‌లుగా గుర్తించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, మున్సిపల్ కమిషనర్ కే.ప్రమీల, ఆర్‌అండ్‌బీ ఈఈ అరవిందాదేవి, టూటౌన్ సీఐ రాజారెడ్డి, ట్రాఫిక్ సీఐ గురునాథ్, ఆర్టీసీ డీఎం వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


