భూముల మార్కెట్ విలువ పెంపు
మదనపల్లె రూరల్ : రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ఇప్పటివరకు అమలులో ఉన్న భూముల మార్కెట్ విలువలు పెంచుతూ మార్కెట్ రేట్స్ రివైజ్డ్ కమిటీ చైర్మన్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఉత్తర్వులు ఇచ్చారని సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూముల మార్కెట్ విలువలు 10 నుంచి 20 శాతం వరకు పెంచారన్నారు. కట్టడాల విలువలు పెరుగుతాయన్నారు. పెరిగిన విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలో కమర్షియల్ భూములకు సంబంధించి గతంలో గజం ధర రూ.32,700 ఉంటే, ప్రస్తుతం రూ.36 వేలకు పెంచారన్నారు. మున్సిపాలిటీలోని 35 వార్డుల్లో రెసిడెన్షియల్ భూములకు సంబంధించి గతంలో గజం ధర రూ.11వేలు ఉంటే, ఇప్పుడు రూ.13,200 కు పెంచినట్లు వివరించారు. మదనపల్లె రూరల్ మండలం పొన్నూటిపాళ్యంలో గతంలో రూ.3,900 ఉంటే, కొత్త ధర రూ.5,500 గా నిర్ణయించారన్నారు. బసినికొండ పంచాయతీలో గతంలో గజం ధర రూ.6,500 ఉంటే కొత్త ధర రూ.7,500 గా ఖరారు చేశారన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోటలో భూముల మార్కెట్ విలువల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. కాగా, ఫిబ్రవరి 1 నుంచి భూముల మార్కెట్ విలువలు పెరగనున్న నేపథ్యంలో భూముల కొనుగోలుదారులు, అమ్మకందారులతో రిజిస్ట్రార్ కార్యాలయం, పరిసరాల్లో జనసందడి కనిపించింది.
సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి


