ఫెయిల్ భయంతోనే వెళ్లిపోయారు
● చలికి తట్టుకోలేక, ఇంటివద్ద ఉండాలని
గురుకులం నుంచి అదృశ్యమయ్యారు
● కౌన్సెలింగ్ ఇచ్చిన ఎంఈఓ, ప్రిన్సిపాల్
బి.కొత్తకోట : బి.కొత్తకోట సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం నుంచి అదృశ్యమైన 8 మంది ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులు..దీనికి వివిధ కారణాలను వెల్లడించారు. ఏడుగురు బుధవారం గురుకులానికి చేరుకోగా ఒకరు రావాల్సి ఉంది. తిరిగి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఎంఈఓ–2 భీమేశ్వరాచారీ, ప్రిన్సిపాల్ ప్రసాద్ సమావేశం నిర్వహించారు. గురుకులం నుంచి ఎందుకు వెళ్లిపోయారు అన్న అంశంపై వారినుంచే వివరాలను రాబట్టారు. వీరిలో నలుగురు విద్యార్థులు బాగా చదివేవారే అయినప్పటికి పరీక్షల్లో ఫెయిల్ అవుతామన్న భయంతో వెళ్లారు. ఇద్దరు విద్యార్థులు సడ్డీ అవర్‌లో చలిలో నిద్రలేవడానికి ఇబ్బందులు పడుతున్నామని అందుకనే వెళ్లిపోయినట్టు స్పష్టం చేశారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు పాఠశాలలో ఉండి చదువుకోలేనని, ఇంటి వద్ద ఉండి చదువుకుంటానని కారణాలు చెప్పగా మరోక విద్యార్థి సాయంత్రం వరకు గురుకులం చే రలేదు. ఏడుగురితో సమావేశమైన అధికారులు..ఇలా చేయడం సరైన పద్దతి కాదని ఏదైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి లేదా తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాల్సిందని చెప్పారు. ఉన్నపళంగా అదృశ్యమైతే దీనికి ఎవరు బాధ్యులెవరైనా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సి వచ్చిందన్నారు. ఇలా ఇకపై వ్యవహరించ వద్దనిసూచించారు. సమస్యలుంటే పరిష్కరిస్తామని, పరీక్షలంటే భయంవల్ల, వాతావరణ ఇబ్బందులుంటే ఉపాద్యాయులతో చెప్పుకుంటే వాటికి తగిన విధంగా సూచనలు, సలహాలు ఇస్తారన్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.


