వీహెచ్‌ఏ అధికారి రంగనాథ్ సస్పెన్షన్
● అర్హులైన రైతులకు పరిహారం అందించాలి
● అధికారులతో వైఎస్సార్‌సీపీ నాయకులు
తొండూరు : ఖరీఫ్‌లో ఉల్లి పంట నష్టపోయిన చాలా మంది రైతులకు నష్ట పరిహారం అందలేదు. అర్హులైన రైతుల పేర్లను జాబితాలో నమోదు చేయకుండా వీహెచ్‌ఏ రంగనాథ్ పంట సాగు చేయని రైతులతో డబ్బులు తీసుకుని వారి పేర్లు చేర్చి అవకతవకలకు పాల్పడ్డారు. ఈ అంశంపై సాక్షిలో ‘పరిహారం – పరిహారం’శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు స్పందించి వీహెచ్‌ఏ రంగనాథ్‌ను సస్పెండ్ చేయాలని జిల్లా ఉద్యాన శాఖ డీడీ సతీష్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సతీష్ స్పందిస్తూ వీహెచ్‌ఏను విధులనుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఉల్లి రైతుల సమస్యకు సంబంధించి బుధవారం పులివెందులలో ఉన్న ఉద్యాన శాఖ కార్యాలయంలో ముద్దనూరు హార్టికల్చర్ అధికారి మల్లేశ్వరరెడ్డి, తొండూరు వ్యవసాయాధికారి రాజులతో వైఎస్సార్‌సీపీ మండల పరిశీలకుడు రామమునిరెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి, సర్పంచ్ బాలగంగిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ నాగేశ్వరరెడ్డి కలిశారు. సంతకొవ్వూరు, ఎస్.చెర్లోపల్లె, గంగనపల్లె గ్రామాల్లో సాగు చేసిన ఉల్లి పంట అవకతవకలపై అధికారులతో మాట్లాడారు. ఖరీఫ్‌లో సాగు చేసిన ఉల్లి పంట పరిహారం అర్హులైన రైతులకు అందించాలన్నారు.


