నకిలీ ధ్రువపత్రాలతో పాస్‌పోర్ట్ మోసం
నిందితుడికి రెండేళ్లు జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా
రాయచోటి : తప్పుడు పత్రాలతో పాస్‌పోర్టు పొందేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కిన వ్యక్తికి రాయచోటి కోర్టు శిక్ష విధించింది. ఫోర్జరీ పత్రాల కేసులో నిందితుడైన షేక్ వసీం అక్రమ్‌కు రెండేళ్ల సాధారణ జైలుశిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధిస్తున్నట్లు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి టి.సుయోధన మంగళవారం తీర్పు వెలువరించినట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి టౌన్ ఆలీమాబాద్ వీధికి చెందిన షేక్ వసీం అక్రమ్ 2023 నవంబర్ 5న పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పదవ తరగతి మార్కుల మెమోను ఫోర్జరీ చేసి నకిలీపత్రాలను అసలైనవిగా నమ్మించి అధికారులను మోసం చేసేందుకు ప్రయత్నించాడు. అక్రమ్‌పై అప్పటి ఎస్పీ ఆదేశాల మేరకు రాయచోటి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నాటి సీఐ సుధాకర్‌రెడ్డి సమగ్ర దర్యాప్తు జరిపారు. పక్కా సాక్షాధారాలతో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా ప్రాసిక్యూషన్ తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీసాయి రామకృష్ణ పటిష్టమైన వాదనలు వినిపించారు. నేరం నిరూపితం కావడంతో న్యాయమూర్తి నిందితుడికి శిక్ష ఖరారు చేసినట్లు పోలీసులు వివరించారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీసాయి రామకృష్ణ, నేరస్తుడికి శిక్షపడేలా శాసీ్త్రయంగా దర్యాప్తు చేసిన పోలీసు అధికారులను, సాక్ష్యాధారాలను సకాలంలో కోర్టుకు సమర్పించిన కోర్టు కానిస్టేబుల్స్, సిబ్బందిని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. తప్పుడు పత్రాలతో ప్రభుత్వ వ్యవస్థలను మోసం చేయాలని చూస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు.


