పశు ఆరోగ్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి
చాపాడు : జిల్లా వ్యాప్తంగా పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పశు ఆరోగ్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని జేడీ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని పెద్దగురువలూరు, నక్కలదిన్నె గ్రామాల్లో మంగళవారం ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ ప్రభుత్వం పాడి రైతులకు ప్రోత్సాహకంగా గ్రామాల్లో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు. పశు వైద్య సిబ్బంది ప్రతి రోజు ఒక గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పశువులకు చికిత్సలు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన పౌల్ట్రీ ఫార్మ్‌ను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ శిబిరాల్లో 17 పశువులకు గర్భనిర్ధారణ పరీక్షలు, 158 పశువులకు సాధారణ చికిత్సలు, 28 గర్భకోశ చికిత్సలు, 2,563 గొర్రెలకు నట్టల నివారణ మందులు, 72 దూడలకు నట్టల నివారణ మందులు తాపించారు. ఈ కార్యక్రమంలో పశువైద్యులు మహ్మద్ గౌస్, సుదర్శన్‌రెడ్డి, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.


