బొలెరే ఢీకొని యువకుడి మృతి
పుంగనూరు : మండలంలోని కనుమలో గంగమ్మ గుడి బైపా మలుపు వద్ద రోడ్డు ప్రమాదం మంగళవారం జరిగింది. రాయల్‌పేట గ్రామానికి చెందిన రెడ్డప్పకుమారుడు భాస్కర్(32) తన స్వగ్రామం నుంచి బైక్‌పై పుంగనూరుకు వస్తుండగా బొలెరే వాహనం ఢీ కొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి గాయాలు
తొండూరు : మండలంలోని బోడివారిపల్లె గ్రామానికి చెందిన ఇద్దరికి మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లక్ష్మీ చైతన్య శివ మనోహర్‌తో కలిసి బైకుపై మల్లేల గ్రామం నుంచి బోడివారిపల్లె గ్రామానికి వెళుతున్నారు. మల్లేల– కోరవానిపల్లె గ్రామాల మధ్య జేసీబీ వాహనం పొలాల వైపు నుంచి రోడ్డు మీదికి రాగా, పల్సర్ బైకును జేసీబీ తగిలింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళుతున్న లక్ష్మీచైతన్య మోకాలి వద్ద రక్తపు గాయాలయ్యాయి. శివమనోహర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే గాయపడ్డ వారిని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
యువకుడి ఆత్మహత్య
వేముల : మండలంలోని రాచకుంటపల్లె గ్రామానికి చెందిన మరకా ప్రకాష్ (24) అనే యువకుడు కడుపు నొప్పి తాళలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మరకా ప్రకాష్ యురేనియం ప్రాజెక్టులోని ఎస్‌ఎంఎస్ కంపెనీలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తుండే వాడు. ఆయనకు ఆరు నెలలుగా కడుపు నొప్పి ఉండటంతో వైద్య చికిత్సలు చేయించుకుంటూ మందులు వాడారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి విపరీతమైన కడుపు నొప్పి రావడంతో భరించలేక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
యువతి అదృశ్యం
మైదుకూరు : మండలంలోని కొత్త సీతారామాపురం గ్రామానికి చెందిన బండారు పోలమ్మ (18) అనే యువతి కనిపించడం లేదని తమకు ఫిర్యాదు అందినట్టు మంగళవారం పోలీసులు తెలిపారు. యువతి తండ్రి పోలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. యువతి ఆచూకీ తెలిసిన వారు మైదుకూరు అర్బన్ సీఐ ఫోన్ నంబర్ 9121100618, అర్బన్ ఎస్‌ఐ నంబర్ 9121100619 లకు సమాచారం అందించాలని కోరారు.
మనస్తాపంతో
మహిళ ఆత్మహత్య
రాయచోటి : పక్కింటిలో కనిపించకుండా పోయిన వెండి గొలుసుల సంఘటనకు తనను బాధ్యురాలిని చేయడంపై మనస్తాపం చెందిన ఎల్.మల్లేశ్వరి (35) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. రాయచోటి పట్టణం రెడ్డీస్ కాలనీలో మంగళవారం లక్కిరెడ్డి రాము సతీమణి మల్లీశ్వరి విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పక్కింటిలో చిన్న పిల్లలకు చెందిన గొలుసులు అపహరణకు గురైనట్లు గుర్తించారు. వాటిని మల్లీశ్వరి కాజేసిందన్న అనుమానంతో పక్కింటి వారు గొడవపడి దాడికి యత్నించారు. చేయని తప్పునకు తనను దొంగగా చిత్రీకరించి దాడి చేశారని మనస్తాపానికి గురైన మల్లీశ్వరి ఇంటిలోని వాస్మోల్ (విష ద్రావణం) సేవించినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు రాయచోటి అర్బన్ పోలీసులు తెలిపారు.
సెల్‌ఫోన్ దొంగ అరెస్ట్
తిరుపతి క్రైమ్ : సెల్‌ఫోన్ చోరీ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ సీఐ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన షబీనా ఈ నెల 18న విష్ణు నివాసంలో ఉండగా ఓ అగంతకుడు లక్షా యాభైవేల విలువ చేసే ఎస్ 24 అల్ట్రా మొబైల్‌ను చోరీ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన కొత్తకోట రమణ ఈ మొబైల్‌ను చోరీ చేసినట్టు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
బొలెరే ఢీకొని యువకుడి మృతి


