త్యాగమూర్తి కన్యకాపరమేశ్వరీదేవి
రాయచోటి : శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి త్యాగమూర్తి అని జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి కొనియాడారు. వాసవాంబ ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం అమ్మవారి చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు, ధర్మ రక్షణ కోసం అహింసా మార్గంలో వాసవి మాత అగ్ని ప్రవేశం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ ఎం.పెద్దయ్య, మహిళా పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జి.శంకర మల్లయ్య, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ ఎ.ఆదినారాయణరెడ్డి, పలువురు ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, డీపీఓ సిబ్బంది, పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు, హోంగార్డులు పాల్గొన్నారు.
ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం
పెద్దతిప్పసముద్రం : వారం రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతదేహానికి ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన భజంత్రి రామక్రిష్ణ(35) ఇంట్లో ఒంటరిగా నివసిస్తూ ఉండే వాడు. ఆయన జీవితంపై విరక్తి చెంది వారం రోజుల క్రితం ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మృతదేహం పూర్తిగా ఉబ్బి పోవడం, నేలంతా రక్తస్రావం, దుర్వాసన అధికం కావడంతో పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో ఎస్‌ఐ పరమేశ్ నాయక్ ప్రత్యేక చొరవ చూపుతూ మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి డాక్టర్ నవీన్‌ను పీటీఎంకు రప్పించి వేలాడుతున్న శవాన్ని కిందికి దింపించి ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించేలా చేశారు. ఒంటరితనం భరించలేకనే తమ సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి అన్న శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మంగళవారం తెలిపారు.


