వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని నీరుగట్టువారిపల్లె రాజానగర్‌కు చెందిన నీలావతి(25) కుటుంబ సమస్యలతో ఇంటి వద్ద విషద్రావణం తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వన్‌టౌన్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
చిట్వేలి : ఆరుగాలం కష్టించి పండించిన పంటలు పండక, పెట్టిన పెట్టుబడులు రాక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చిట్వేలి మండలంలో జరిగింది. ఆదివారం కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని జట్టువారిపల్లికి చెందిన ఏదోటి సుబ్బరాయుడు (48) కౌలుకు 15 ఎకరాలలో బొప్పాయి, అరటి సాగు చేస్తున్నాడు. పండించిన పంటలు పండక, పెట్టుబడి రాక అప్పుల బాధతో పొలంలో శనివారం విషపు గుళికలు మింగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన రేణిగుంట ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో
ఇరువురికి గాయాలు
బద్వేలు అర్బన్ : పట్టణంలోని అగ్రహారం సమీపంలో గల న్యూబైపాస్ రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని మడకలవారిపల్లెకు చెందిన సీనియర్ జర్నలిస్టు రఘురామిరెడ్డి, మరో వ్యక్తి కారులో న్యూబైపాస్ రోడ్డులో వెళుతుండగా అగ్రహారం సమీపంలోకి రాగానే గేదెలు అడ్డు రావడంతో వాటిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రఘురామిరెడ్డి తలకు తీవ్ర గాయాలు కాగా మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 సహాయంతో గాయపడిన వారిని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కడపకు తీసుకెళ్లారు.
నిలకడగా విద్యార్థుల ఆరోగ్యం
తొండూరు : తొండూరు మండలం అగడూరు పంచాయతీ పరిధిలో గల యాదవారిపల్లె ప్రాథమిక పాఠశాలలో శనివారం జరిగిన ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆదివారం పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి విలేకరుల బృందంగా వెళ్లి.. అక్కడి వైద్యులు, విద్యార్థుల తల్లిదండ్రులతో వివరాలు తెలుసుకోగా, ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారన్నారు. సోమవారం విద్యార్థులను డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.
వివాహిత ఆత్మహత్యాయత్నం


