దరఖాస్తు చేసుకోవాలి
రాయచోటి జగదాంబసెంటర్: భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ 2025–26 సంవత్సరానికి ‘జాతీయ యువత, కౌమార అభివృద్ధి పథకం (ఎన్‌పీవైఏడీ) కింద ఆర్థిక సహాయం కోసం ఎన్‌జీఓ దర్పణ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న సంస్థలు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని స్టెప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జోయెల్ విజయ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ వెబ్‌సైట్ https://youth/yas.gov.in/scheme/ npyad/ngo/login ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
రాజంపేట టౌన్: పట్టణంలోని అమ్మవారిశాలలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం సత్యనారాయణ స్వామివ్రతాన్ని పురోహితులు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. వ్రతంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఇదిలావుండగా ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.కార్యక్రమంలో కౌన్సిలర్ సనిశెట్టి నవీన్‌కుమార్, ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు రమేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
రాయచోటి: పని అనుభవాన్ని ఆధారంగా చేసుకొని సృజనాత్మకంగా గైడ్ కెప్టెన్లు రూపొందించిన బోధనోపకరణాలు, కళాత్మక వస్తువులు, అలంకరణ సామాగ్రి అబ్బురపరిచేవిగా ఉన్నాయని స్కౌట్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి అన్నారు. రాయచోటిలోని డైట్‌లో బేసిక్ గైడ్ కెప్టెన్లకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా బుధవారం వారి చేతుల్లో రూపుదిద్దుకున్న వివిధ రకాల బోధనోపకరణాలు, అలంకరణ సామగ్రిని ప్రదర్శించారు. గైడ్ బోధనలో కొత్త దనాన్ని తీసుకురావడమే కాకుండా కఠినమైన పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకునేలా చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయని నరసింహారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రంమలో లీడర్ ఆఫ్ ది కోర్సు డాక్టర్ కస్తూరి సుధాకర్, అడ్వాన్స్ గైడ్ కెప్టెన్లు సుజాత, జిల్లాలోని 55 మంది బేసిక్ గైడ్ కెప్టెన్లు పాల్గొన్నారు.
నందలూరు: రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకే జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం నందలూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో కలెక్టర్ ప్రజల నుంచి వివిధ రకాల అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్‌కు అందిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జిల్లా వ్యాప్తంగా రాజంపేట, మదనపల్లె, రాయచోటి డివిజన్లలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా ప్రజలు సమర్పించిన ఫిర్యాదులు ఏ స్థితిలో ఉన్నాయి..పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై స్పష్టత సాధించడం, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా వినడం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం రెవెన్యూ సేవలను మరింత చేరువ చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట సబ్ కలెక్టర్ భావన, తహసీల్దార్ అమరేశ్వరి, ఎంపీడీఓ కెఆర్‌ఎం ప్రసాద్, ఈఓపీఆర్‌డీ సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు చేసుకోవాలి


