పరిమళించిన ఆధ్యాత్మిక గంధం
కడప సెవెన్‌రోడ్స్: ఆధ్యాత్మిక సుగంధం పరిమళించింది....అందరి మనసుల నిండా భక్తిభావం ఉట్టిపడింది....ఆ ప్రాంగణమంతా ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. కడప పెద్దదర్గా ఉరుసు ఉత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. హజరత్ సూఫీ సర్ మస్తాని చిల్లాకష్ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ చిష్ఠివుల్ ఖాద్రీ సాహెబ్ ఉరుసు ఉత్సవాల్లో భాగంగా దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ తన నివాసం నుంచి అలంకరించిన గంధం కలశంతో ఫకీర్ల మేళతాళాలు, సాహస విన్యాసాల మధ్య ఊరేగింపుగా దర్గాలోని గురువుల మజార్ వద్దకు తరలి వెళ్లారు. గంధం సమర్పించి ఫాతెహా నిర్వహించారు. గంధ మహోత్సవంలో ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ముషాయిరా హాలులో దర్గా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంస్థల వార్షిక నివేదికతోపాటు అమీన్ ఎడ్యుకేషనల్ ట్రస్టు విశేషాలను, విజయాలను నిర్వాహకులు పీఠాధిపతికి సమర్పించారు. అనంతరం దర్గా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలో నిర్వహించిన పలు పో టీలలో విజేతలకు బహుమతులు అందజేశారు.
దీక్షలో మలంగ్‌షా
ఈ సందర్భంగా మలంగ్‌షాను పీఠాధిపతి దీక్ష వహింపజేశారు. దర్గా నుంచి కడప నగరంలోని పలు ముఖ్య కూడళ్ల మీదుగా వెళ్లిన మలంగ్‌షా, అనుచర బృందం నాగరాజుపేటలోని బాదుల్లాసాహెబ్ మకాన్‌కు చేరింది. మకాన్ నిర్వాహకులు, స్థానిక భక్తులు వారిని ఘనంగా స్వాగతించారు. సాయంత్రం ఆ బృందం ఊరేగింపుగా తిరిగి దర్గాకు చేరుకుంది. రాత్రి మలంగ్‌షా దర్గా ఆవరణంలోని పీర్లచావిడిలో దీక్ష వహించారు. దర్గా పీఠాధిపతి స్వయంగా వెళ్లి ఆయనకు సంప్రదాయబద్ధంగా దీక్ష వహింపజేశారు.
ఫకీర్ల మేళతాళాల మధ్య దర్గాకు చేరుకున్న పీఠాధిపతి
గురువు మజార్ వద్ద గంధం సమర్పణ


