 
															వేధింపుల బారి నుంచి కాపాడండి
మదనపల్లె రూరల్ : మద్యం సేవించి, ఆడపిల్లల వెంటపడి వేధిస్తూ, పలువురిపై దౌర్జన్యం చేస్తూ గ్రామంలో అల్లర్లు సృష్టిస్తున్న ముగ్గురు ఆకతాయిల వేధింపుల నుంచి తమను కాపాడాలని, నిందితులపై కేసు నమోదు చేసి ఆడబిడ్డలకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతూ మండలంలోని పాశంవారి పల్లెకు చెందిన గ్రామస్తులు, సోమవారం మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. ఆదివారం రాత్రి మండలంలోని పెంచపాడు పంచాయతీ పాశంవారిపల్లెలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వెంకటప్ప, కోటూరి భరత్, వరణ్‌సందేశ్ మద్యం మత్తులో అదే గ్రామానికి చెందిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించి వేధించడమే కాకుండా కత్తితో దాడి చేశారు. ఘటనను అడ్డుకునేందుకు స్థానికులు మహి, వెంకటరమణ ప్రయత్నించగా వారిపై కత్తితో వెంకటప్ప, మరో ఇద్దరు యువకులు దాడి చేశారు. ఈ ఘటనకు నిరసనగా గ్రామస్తులు ఏకమై సోమవారం మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో 150 కుటుంబాలు ఉన్నాయని, గ్రామానికి చెందిన వెంకటరమణ కుమారు డు కోటూరి వెంకటప్ప, రఘపతి కుమారుడు కోటూరి భరత్, బాబు కుమారుడు వరణ్‌సందేశ్ జులాయిగా తిరుగుతూ, మద్యం సేవించి తరచూ ఆడపిల్లలను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు .అడ్డుకోబోయిన వారి పైన దాడికి తెగబడుతూ అసభ్యపదజాలంతో దూషిస్తున్నారన్నారు. స్థానికంగా ఉన్న ఓ మహిళపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరచారన్నారు. మూడు కుటుంబాలను బెదిరింపులకు గురి చేశారన్నారు. వీరికి ఇది వరకే తాలుకా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా మార్పు రాలేదన్నారు. పదేపదే ఆడపిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న యువకులపై కఠిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు.
తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద
బాధితుల ఆందోళన

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
