 
															ఓట్లు, సీట్ల రాజకీయాలు చేస్తే క్షమించేది లేదు
మదనపల్లె రూరల్ : గిరిజనుల జాబితాలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపడిన కులాలను తీసుకువచ్చి ఎస్టీ హోదా కల్పిస్తామని సీఎం చంద్రబాబునాయుడు, ప్రధాని మోదీ చెపుతున్నారని, అధికారంలోకి వచ్చేందుకు ఓట్లు, సీట్లు రాజకీయాలు చేస్తే ప్రజలు క్షమించే పరిస్థితి లేదని రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్యా శంకర్‌నాయక్ హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని మున్సిపల్ టౌన్‌హాల్‌లో గిరిజన ప్రజాసమాఖ్య(జీపీఎస్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గిరిజనుల ఆత్మీయ ముఖ్య నేతల రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గిరిజన ఓట్లతో అధికారంలోకి వచ్చిన పాలకులు, ప్రభుత్వాలు అధికారాన్ని అనుభవిస్తూ, విదేశాల్లో విహారయాత్రలు చేస్తుంటే, తమ గోడు ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు గిరిజన సమాజంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలుచేయాలన్నారు. గిరిజనజాతి అభివృద్ధికి ప్రతి ఏటా ప్రభుత్వాలు కేటాయించే కోట్లాది రూపాయల నిధులు దారి మళ్లకుండా ఉండాలంటే చట్టసభల్లో గిరిజనుల తరపున ప్రాతినిథ్యం వహించే వ్యక్తి ఉండాలన్నారు. కార్యక్రమంలో గిరిజన నేతలు విశ్వనాథ్‌నాయక్, మునీంద్రనాయక్, మూడే ప్రసాదనాయక్, లక్ష్మానాయక్, చిన్నరాయుడు తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
