● పశువులను చోరీ చేసి తరలిస్తుండగా గుర్తించిన స్థానికులు
● వాహనాన్ని వదిలి పరారైన దుండగులు
కలికిరి(వాల్మీకిపురం) : వాల్మీకిపురం మండల పరిధిలోని గండబోయనపల్లిలో దొంగల ముఠా హల్‌చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు... గండబోయనపల్లికి చెందిన పాడి రైతు వి.చిన్న రెడ్డెప్ప తన ఇంటి ఆవరణలో ఆవులు, దూడలను కట్టేసి వున్నాడు. శనివారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని దుండగులు గుట్టుచప్పుడు కాకుండా రెండు పాడి ఆవులను దొంగిలించి దర్జాగా హైవే రోడ్డుపై నిలిపిన బొలోరో పికప్ (నెం.ఏపి02 టిబి 5680) వాహనంలోకి ఎక్కిస్తున్నారు. అటుగా వచ్చిన స్థానికులు గమనించి అర్థరాత్రి సమయంలో పశువులను ఎందుకు తరలిస్తున్నారని దుండగులను ఆరా తీశారు. అదే సమయంలో ఆవులు లేకపోవడంతో దూడల అరుపులు విని నిద్ర లేచి చూసిన రైతు గట్టిగా కేకలు వేశాడు. పాడి రైతు అరుపులు విన్న దుండగులు వాహనాన్ని, ఆవులను అక్కడే వదిలి పరారయ్యారు. స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడి దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నించినా వారు తప్పించుకున్నారు. స్థానికులు 112కు డయల్ చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. విచారించిన వాల్మీకిపురం పోలీసులు ఆదివారం ఉదయం వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చోరీ చేసిన పాడి పశువులను మరో ప్రాంతానికి తరలించి విక్రయించడానికా.. లేక కళేబరాలకు తరలించడానికా.. అనేది పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. గతంలోనూ వాల్మీకిపురం మండల పరిధిలోని గండబోయినపల్లి, తాటిగుంటపల్లి, మంచూరు, మూరేవాండ్లపల్లి తదితర గ్రామాల్లో పాడి ఆవులు, బోరు మోటార్ల వైర్లు, స్టార్టర్లు చోరీకి గురయ్యాయి. వ్యవసాయ పొలాల వద్ద రైతులు ఏమారితే వైర్లు చోరీకి గురవుతుండటం రైతులకు రాత్రి పూట నిద్రలేకుండా చేస్తోంది. పోలీసులు లోతుగా దర్యాప్తు నిర్వహించి నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుని చోరీలకు అడ్డుకట్టవేయాలని ప్రజలు కోరుతున్నారు.
నిందితుల గుర్తింపు పనిలో ఉన్నాం..
మండల పరిధిలోని గండబోయనపల్లి వద్ద దుండగులు వదిలి వెళ్లిన వాహనం ఆధారంగా నిందితుల గుర్తింపులో ఉన్నాం. స్థానికులు ఇచ్చిన వివరాల మేరకు త్వరలో నిందితులను అదుపులోకి తీసుకుంటాం.
– చంద్రశేఖర్, ఎస్‌ఐ, వాల్మీకిపురం
గండబోయనపల్లిలో దొంగల ముఠా హల్‌చల్