
ఏపీ అంటే అమరావతి, పోలవరమా?
వైఎస్సార్‌సీపీ జిల్లా పరిశీలకులు కె.సురేష్‌బాబు
రాజంపేట రూరల్ : ఏపీ అంటే అమరావతి, పోలవరం అనే విధంగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా పరిశీలకులు కొత్తమద్ది సురేష్‌బాబు, జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాథరెడ్డి విమర్శించారు. మండల పరిధిలోని ఆకేపాటి ఎస్టేట్‌లో ఆదివారం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ రూరల్ పరిధిలో కోటీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆకేపాటి అనీల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్‌సీపీ జిల్లా పరిశీలకులు కొత్తమద్ది సురేష్‌బాబు, జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాథరెడ్డి పాల్గొని మండల పరిధిలోని నాయకులు, కార్యకర్తలకు కోటి సంతకాల సేకరణపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలతోపాటు జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందజేస్తున్న పథకాలన్నింటిని అమలు చేస్తామని కూటమి నాయకులు ప్రజలను మభ్య పెట్టారన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం అపసోపాలు పడుతోందని ఎద్దేవా చేశారు. తమ సామాజిక వర్గానికి మేలు చేసేందుకు అమరావతికి వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలను అమలు చేయక పోగా.. నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకున్నారని దుయ్యబట్టారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయనీయబోమని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆశా దీపంగా నిలుస్తున్న మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటం సరికాదన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించి సంతకాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రేపటి మన బిడ్డల భవిష్యత్ కోసం మనం వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలన్నారు. ఈ సమావేశంలో అధిక సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.