
ఎర్రచందనం కేసులో ఇద్దరికి జైలుశిక్ష
ములకలచెరువు/తిరుపతి లీగల్ : ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలు శిక్ష, మూడు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పుచెప్పారు. కోర్టు లైజనింగ్ ఆఫీసర్ కె.శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ ఆర్.గణేష్ తెలిపిన వివరాల మేరకు.. 2019 డిసెంబర్, 5న ములకలచెరువు పోలీసులకు వచ్చిన సమాచారంతో మదనపల్లె–కదిరి రోడ్డు తంబేపల్లి క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. మదనపల్లె నుంచి ఓ టాటా సుమో వాహనం అతివేగంగా వస్తూ పోలీసులలను చూసి ఆగింది. ఆ వాహనంలోని ఇద్దరు కర్ణాటక, కోలార్ జిల్లా బంగారుపేట తాలూకా, దొడ్డూరుకు చెందిన నారాయణప్ప శివకుమార్, బంగారు పేట తాలూకా కురబర హళ్లికి చెందిన సుబ్రహ్మణ్యం, మంజునాథ్ పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. టాటా సుమో వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో ఉన్న 162 కిలోల ఐదు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.