
రిజిస్ట్రేషన్ శాఖలో.. ఆదాయం ఢమాల్!
రాయచోటి అర్బన్ : గత రెండేళ్లతో పోల్చుకుంటే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో ఈ ఏడాది ఆదాయం లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. స్థిరాస్తి ఆదాయ లక్ష్య సాధనలో వెనుకబాటుకు ప్రధాన కారణం ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల నిర్లక్ష్యాలే కారణంగా తెలుస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.258.17 కోట్లు లక్ష్యంగా నిర్ణయించారు. అయితే 2025 అక్టోబబర్ 14వ తేదీ వరకు అన్నమయ్య జిల్లాలోని 12 సబ్ రిజిస్టర్ కార్యాలయాల నుంచి కేవలం రూ.97.19 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. ఇదిలా ఉంటే 2023–24 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యం రూ. 241.91 కోట్లు కాగా, 2023–24లో వచ్చిన ఆదాయం రూ.183.35 కోట్లుగా ఉంది. అలాగే 2024–25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యం రూ. 205.76 కోట్లు ఉండగా, 2024–25లో రూ.167. 83 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ విధంగా ఉన్న ఆదాయాన్ని పరిశీలిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోనే స్థిరాస్తి ఆదాయం పూర్తిగా పడిపోయినట్లు తెలుస్తోంది.
ఆదాయం తగ్గడానికి ప్రభుత్వ విధానాలే కారణం..
జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వ విధానాలతో పూర్తిగా కుప్పకూలిపోయింది. కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన తరువాత ప్రీ హోల్డ్ అసైన్‌మెంట్ భూముల రిజిస్ట్రేషన్‌ను ఆపేసింది. దీనికి తోడు రీసర్వేపై ఉత్కంఠ, భూముల మ్యుటేషన్లలో గందరగోళం నెలకొంది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త వెంచర్లను వేయడానికి వెనకడుగు వేస్తున్నారు. మరో వైపు రిజిస్ట్రేషన్ ఫీజులను భారీగా పెంచడంతో వ్యాపారులపై, పెట్టుబడిదారులపై అధిక భారం పడింది. దీంతో క్రయ విక్రయాలకు వ్యాపారులు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు సగానికి పైగా పడిపోయాయి.
జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భారీగా తగ్గిన ఆదాయం...
అన్నమయ్య జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అందులో మదనపల్లె , రాయచోటి, రాజంపేట, పీలేరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆదాయం రాబడిలో ప్రధానమైనవి. కలికిరి, తంబళ్లపల్లె, వాయల్పాడు, బి.కొత్తకోట, చిట్వేలి, లక్కిరెడ్డిపల్లె, పుల్లంపేట, టి.సుండుపల్లె ఓ మోస్తరుగా రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాలు కావడం విశేషం. అయితే జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో కూడా నిర్దేశించిన ఆదాయంలో సగం కూడా రాబడి రాకపోవడం గమనార్హం. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.258.17 కోట్లు లక్ష్యంగా నిర్ణయించగా, 2025 అక్టోబబర్ 14వ తేదీ వరకు అన్నమయ్య జిల్లాలోని 12 సబ్ రిజిస్టర్ కార్యాలయాల నుంచి కేవలం రూ.97.19 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది.
ఈ ఏడాది లక్ష్యం రూ.258.17
కోట్లు , అక్టోబర్ 14వరకు వసూలు రూ.97.19 కోట్లే
రియల్ ఎస్టేట్ ప్రభావంతోనే భారీగా తగ్గిన ఆదాయం
రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచిన కూటమి ప్రభుత్వం
లక్ష్య సాధనలో వెనుకబడిన జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

రిజిస్ట్రేషన్ శాఖలో.. ఆదాయం ఢమాల్!