
20 రోజుల క్రితం అదృశ్యమై.. కాలువలో శవమై..
మదనపల్లె రూరల్ : మెడికల్ షాపు యజమాని శ్రీకాంత్(58) అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. 20 రోజుల తర్వాత పుంగనూరు మండలం ఈడిగపల్లె సమీపంలోని యాతాళంవంక వద్ద హంద్రీ నీవా కాలువలో గురువారం శ్రీకాంత్ మృతదేహం లభ్యమైంది. హంద్రీనీవా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతుండటం గమనించిన స్థానికులు పుంగనూరు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీశారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యంపై పోలీసులు మదనపల్లె పోలీస్ స్టేషన్‌లకు సమాచారం అందించారు. దీంతో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సెప్టెంబర్ 27న మిస్సింగ్ కేసుగా నమోదైన శ్రీకాంత్ బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం శ్రీకాంత్‌దేనని నిర్ధారించారు. మృతదేహాన్ని తరలించేందుకు వీలు లేకపోవడంతో దొరికిన చోటే పోస్టుమార్టం నిర్వహించారు. పట్టణంలోని చిత్తూరు బస్టాండ్‌లో గాయత్రి మెడికల్ షాపు నిర్వహిస్తూ రోజా ప్లాట్స్‌లో నివాసం ఉంటున్న శ్రీకాంత్, రాయచోటికి వెళ్లి వస్తానని భార్య గాయత్రితో చెప్పి సెప్టెంబర్ 26న ఇంటి నుంచి బయలుదేరాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం గాలించారు. అయితే మరుసటిరోజు మండలంలోని చిప్పిలి సమీపంలోని హంద్రీనీవా కాలువ ఒడ్డున శ్రీకాంత్‌కు సంబంధించి స్కూటీ వాహనం, సెల్‌ఫోన్ లభించాయి. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హంద్రీ నీవా కాలువలో గాలించారు. ఎలాంటి ఫలితం లేకపోవడంతో, వన్‌టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేసి విచారణ కొనసాగించారు. కుటుంబ సభ్యులు శ్రీకాంత్ వాహనం వదిలేసి, ఎక్కడికై నా వెళ్లి ఉంటాడని భావించారు. అయితే 20 రోజుల తర్వాత పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకాంత్ శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. శ్రీకాంత్‌ను హత్యచేశారా... లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అన్నది పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది. కాగా శ్రీకాంత్ మృతదేహానికి కాలి చెప్పులు కూడా అలాగే ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల ద్వారా పోలీసులు వాస్తవాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. శవం లభ్యమైన ప్రాంతం పుంగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండటంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీడిన మెడికల్ షాపు యజమాని
అదృశ్యం మిస్టరీ
20 రోజుల తర్వాత హంద్రీ నీవా
కాలువలో శవం లభ్యం
హత్యా.. ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు

20 రోజుల క్రితం అదృశ్యమై.. కాలువలో శవమై..