
వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తంబళ్లపల్లె మండలం బురదలోళ్లపల్లెకు చెందిన కట్టప్ప కుమారుడు రామాంజులు(22) గ్రామాలకు వెళ్లి గ్యాస్‌స్టవ్‌లు రిపేరీ చేస్తూ జీవిస్తుంటాడు. గురువారం ద్విచక్రవాహనంలో తంబళ్లపల్లెకు వెళుతుండగా, అదే మండలం సిద్ధారెడ్డిగారిపల్లెకు చెందిన శివకుమార్(32) ద్విచక్రవాహనంలో ఎదురుగా వస్తూ రామాంజులు బైక్‌ను ఢీకొన్నాడు. ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
చికిత్స అనంతరం రామాంజులు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. అదేవిధంగా శానిటోరియం తురకపల్లెకు చెందిన గౌసియా(45) స్థానిక దర్గాలో ఉరుసు ఉత్సవం జరుగుతుండగా, బుధవారం రాత్రి అక్కడకు వెళ్లేందుకు రోడ్డు దాటుతోంది. ఈ క్రమంలో అటుగా వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొంది. ప్రమాదంలో గౌసియా తీవ్రంగా గాయపడగా, స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.