
అక్రమ రవాణాకు అడ్డుకట్టేది.!
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె, సరిమడుగు పంచాయతీల పరిధిలో కొంతమంది వ్యక్తులు అక్రమంగా చెట్లను నరికి వేసి లారీల్లో బయట రాష్ట్రాలకు తరలించుకుపోతున్నారు. వృక్ష సంపదను తరలిస్తున్న లారీలను అటవీ, రెవెన్యూ అధికారులు నిలిపి మామూళ్లు వసూలు చేసుకొని వదిలేస్తున్నారు. మండలంలోని బయట రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు మకాం వేసి ఇష్టానుసారం చెట్లను నరికేసి తరలించుకుపోతుండడం గమనార్హం.
రెండు గ్రామాల పరిసరాల్లోని కొండలు, గుట్టల తో పాటు పొలాల్లో పెద్ద ఎత్తున కలప చెట్లు ఉన్నాయి. వీటిపై అక్రమార్కుల కన్ను పడింది. స్థానికంగా ఉంటున్న కొంతమంది అక్రమార్కులు బయట రాష్ట్రాల వ్యాపారులతో బేరాలు కుదుర్చుకొని చెట్లను అక్రమంగా నరికి వేస్తున్నారు. కన్నుపడిందే తడవుగా చెట్లను అక్రమంగా నరికివేసి ట్రాక్టర్ల ద్వారా గ్రామాల్లో కొన్ని చోట్ల డంపింగ్ చేస్తున్నారు. ఆ తరువాత లారీల్లో అక్రమంగా నరికేసిన చెట్లను లోడింగ్ చెసి బయట రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. గత పదిహేను రోజులుగా ఈ తంతు యథేచ్ఛగా సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొంతమంది బయట రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడే మకాం వేసి ఇష్టానుసారం కలపచెట్లను నరికి వేసి అక్కడే కుప్పలుగా వేస్తున్నారు. వీటిలో నల్లతుమ్మచెట్లతో పాటు సండ్ర, వేప, చింతచెట్లు ఇతర కంప జాతులకు చెందిన వృక్షాలు ఉండడం గమనార్హం. వీటికి ఫ్యాక్టరీలు, ఇతర బొగ్గుల వినియోగం కోసం గత కొంతకాలంగా పదులకొద్ది వాహనాల్లో అక్రమార్కులు తరలించుకుపోతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఎంతో విలువైన వృక్ష సంపదను నాశనం చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. అఽధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాల్సి ఉంది.
మామూళ్ల మత్తులో జోగుతున్న ఆధికారులు..
గత పదిహేను రోజులుగా పదుల సంఖ్యలో చెట్లను అక్రమంగా నరికేస్తున్నా అటవీ, రెవెన్యూ అధికారులు మామూళ్లు మత్తులో జోగుతున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వ భూముల్లో చెట్లను నరకడం చట్టరీత్యా నేరం. పట్టాభూముల్లో చెట్లను నరికి వేయాలన్నా రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అయితే ఇవేవి అక్రమార్కులు పాటించడం లేదు. చివరకు ప్రభుత్వ భూముల్లో చెట్లను కూడా అక్రమార్కులు నరికివేస్తున్నా పట్టించుకునే దిక్కులేదు. కొంతమంది రెవెన్యూ, అటవీశాఖ అధికారులు బయట రాష్ట్రాలకు కలపతో వెళుతున్న లారీలను ఆపి మామూళ్లను వసూలు చేసుకొని పంపించి వేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
గుర్రంకొండ మండలం సూరప్పగారిపల్లె సమీపంలో
బయట రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన కలపలారీ
గుర్రంకొండ మండలం సుబ్బిరెడ్డిగారిపల్లె– గుండ్లగుట్టతాండా మధ్యలో
డంపింగ్ చేసిన కట్టెలను లారీల్లోకి లోడింగ్ చేస్తున్న కూలీలు
చెట్లు నరికి అక్రమంగా లారీల్లో తరలింపు
వాహనాల వద్ద మామూళ్లు
వసూలు చేస్తున్న సిబ్బంది
గుర్రంకొండలో మకాం వేసిన
బయటి రాష్ట్రాల వ్యాపారులు

అక్రమ రవాణాకు అడ్డుకట్టేది.!

అక్రమ రవాణాకు అడ్డుకట్టేది.!