
టీడీపీ సమావేశంలో రచ్చ
– ఓ ప్రజాప్రతినిధిపై చేయిచేసుకున్న వైనం
సాక్షి టాస్క్‌ఫోర్స్ : రాజంపేట ఆర్‌ఎస్‌రోడ్డులోని ఏబీ చంద్రారెడ్డి గార్డెన్స్‌లో బుధవారం నందలూరు, ఒంటిమిట్ట మండలాల కమిటీ నియామకాల సమావేశం నిర్వహించారు. సమావేశానికి పరిశీలకుడు వచ్చారు. ఈ సమావేశంలో ఒంటిమిట్ట మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధిపై దాడి జరిగినట్లుగా ఆ పార్టీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరిగింది. అదే మండలానికి చెందిన బీసీ నేత ఒకరు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఓ ప్రజాప్రతినిధిపై ఇన్‌చార్జి, పరిశీలకుని సమక్షంలోనే చేయిచేసుకున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రధానంగా ఒంటిమిట్టకు సంబంధించి ఉన్న మండల కమిటీనే ఉండాలని ఒక వర్గం వారు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను మరో వర్గం వారు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాలు కలిసి ఒంటిమిట్ట మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి పై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఒంటమిట్టి మండల కమిటీ నియామకం విషయం రసాభాసగా మారడం గమనార్హం.
వాటర్‌షెడ్ పనుల పరిశీలన
సుండుపల్లె : మండల పరిధిలోని సుండుపల్లె–2 గ్రామ పంచాయతీలోని సామిసేనిగడ్డ సమీపంలో చెక్‌డ్యాంలను విజయవాడ పంచాయతీరాజ్ డెవలప్‌మెంట్ శాఖ అధికారులు, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరత్నం బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 7 మండలాలను ఉత్తమ మండలాలుగా గుర్తించారని అందులో సుండుపల్లెకు మూడవ స్థానం రావడం అభినందనీయమన్నారు. అవార్డు కింద మండలానికి రూ.20 లక్షల అదనపు పనులను కేటాయించినట్లు తెలిపారు. అలాగే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డుదారులకు త్వరగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి అశోక్‌రెడ్డి, ఏపీఓ మాలిక్‌బాషా, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.
రాయచోటి జగదాంబసెంటర్ : లైసెన్సుదారులు తమ మద్యం దుకాణాలలో రీటైల్ పోర్టల్ ద్వారా స్కాన్ అయిన మద్యం సీసాలను మాత్రమే అమ్మాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ మధుసూదన్ తెలిపారు. రాయచోటి పట్టణంలో బుధవారం పలు మద్యం షాపుల యజమానులకు, నౌకరనామదారులకు ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసిన మద్యం బాటిళ్లను అమ్మే ప్రక్రియను ప్రత్యక్షంగా గమనించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎకై ్సజ్ సురక్ష యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వారు కొన్న మద్యం సరైనదో కాదో తెలుసుకోవాలని సూచించారు. ఏ వినియోగదారుడైనా ఈ యాప్ ద్వారా తాము కొన్న మద్యం బాటిల్ ప్రభుత్వం సరఫరా చేసినది కాదని తెలిసిన వెంటనే జిల్లా ఎకై ్సజ్ అధికారికి కానీ సమీపంలో ఉన్న ఎకై ్సజ్ శాఖ అధికారి లేదా సిబ్బందికి తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ మద్యంపై 79481216391 నంబర్‌కు సమాచారం ఇస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.
వెట్టిచాకిరీ భరించలేక
కార్మికురాలి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : ఆరేళ్లుగా తమ నుంచి వెట్టిచాకిరీ చేసుకుంటున్న మగ్గాల నిర్వాహకుడి వేధింపులు తాళలేక చేనేత కార్మికురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి కురబలకోట మండలంలో జరిగింది. బాధితురాలు, ఆమె కుటుంబీకుల కథనం మేరకు వివరాలు.. రాయచోటి మండలం పెద్ద కోడివాండ్లపల్లెకు చెందిన దంపతులు ఆర్.రాజశేఖర్, నాగవేణి(32)లు చేనేత మగ్గం పనులతో బతుకుదెరువు సాగించాలని ఆరేళ్ల క్రితం కురబలకోట మండలంలోని చేనేత నగర్‌కు వచ్చి స్థిరపడ్డారు. అక్కడ లోకేశ్వర్ రెడ్డి అనే మగ్గాల నిర్వాహకుడి వద్ద పనికి కుదిరారు. ఆరేళ్ల క్రితం అతని నుంచి రూ.1.60 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు. తర్వాత పని చేస్తూనే వారికి వచ్చే కూలీ సోమ్మును జమ చేస్తూ వస్తున్నారు. అయితే అడ్వాన్స్ తీరలేదంటూ చెప్పడంతో తాము వేరేచోట పనికి వెళ్లి మిగిలిన అప్పు తీరుస్తామని దంపతులు అతనితో చెప్పుకున్నారు. దీనికి అంగీకరించని యజమాని తన వద్దనే పని చేయాలని పేర్కొన్నాడు. తమతో పని చేయించుకోవడమే కాకుండా చీటీలు కూడా నడుపుతూ వాటికి కూలీ సోమ్మును జమ వేసుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడుతున్నా కూలీ కూడా చేతికి రాకపోవడంతో ఇంటికి బాడుగ కట్టుకోలేక, పిల్లల్ని చదివించలేక ఇబ్బందులు పడుతూ వస్తున్నామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో నాగవేణి ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. పిల్లలు చూసి కేకలు వేయడంతో స్థానికులు, కుటుంబీకులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. పరీక్షించిన వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. తమను మగ్గాల యజమాని నుంచి విముక్తిని కల్పించాలని కుటుంబీకులు కోరుతున్నారు.

టీడీపీ సమావేశంలో రచ్చ