
పొట్టకూటి కోసం వచ్చి.. అనంత లోకాలకు..
● విద్యుత్ షాక్‌తో
ఇద్దరు బీహార్ కార్మికుల మృతి
● మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఏఐటీయూసీ నాయకుల డిమాండ్
పెద్దతిప్పసముద్రం : పొట్టకూటి కోసం బీహార్ నుంచి వచ్చిన ఇద్దరు కార్మికులు బుధవారం కరంటు షాక్‌తో మృతి చెందిన సంఘటన మండలంలోని కందుకూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే ములకలచెరువు మండలం బిల్లూరివాండ్లపల్లికి చెందిన ఆవుల రాజశేఖర్ అలియాస్ రాజు అనే వ్యక్తి కందుకూరులోని వడ్డిపల్లి రోడ్డులో బాలక్రిష్ణ అనే వ్యక్తికి చెందిన ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకుని సిమెంటు ఇటుక తయారీ కేంద్రం నిర్వహిస్తున్నాడు. ఈ ఇటుకల తయారీ కేంద్రాన్ని సద్దాం అనే వ్యక్తి చూసుకునేవాడు. ఈ నేపథ్యంలో బీహార్‌కు చెందిన గుడ్డు షహాని (27). ఇంద్రసన్ సహానీ (42)లు గత నాలుగు నెలలుగా ఇక్కడ కార్మికులుగా పని చేసేవారు. ఈ తరుణంలో ఎప్పటి లాగానే కార్మికులిద్దరూ బుధవారం ఉదయం ఇటుకల తయారీ యంత్రాన్ని ఆన్ చేయగా యంత్రానికి అమర్చిన మోటారు వైండింగ్ స్లివ్ తెగి ఇనుప యంత్రానికి విద్యుత్ సరఫరా కావడంతో బీహార్‌కు చెందిన కార్మికులిద్దరూ యంత్రానికే అతుక్కుని తనువు చాలించినట్లు డిస్కం ఏఈ గిరిధర్ ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న ఇన్‌చార్జి సీఐ గోపాల్‌రెడ్డి, ఇన్‌చార్జి ఎస్‌ఐ నరసింహుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆర్‌ఐ హుసేన్, వీఆర్వో రమణ సమక్షంలో పోలీసులు శవ పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కరెంటు షాక్‌కు బలైన కార్మికుల మృతదేహాలను ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఉప కార్యదర్శి సలీంబాషా, నియోజకవర్గ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, బాలక్రిష్ణలు సందర్శించారు. ఇటుకల తయారీ కేంద్రం నిర్వాహకుడి నిర్లక్ష్యం వల్లే ఇద్దరు కార్మికులు బలయ్యారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు, కార్మిక శాఖ అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి మృతుల కుటుంబీకులను అన్ని విధాలా ఆదుకుని పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.