
వ్యాపారిపై టీడీపీ నాయకుడి దాడి
మదనపల్లె రూరల్ : స్థలం వివాదంలో ఓ వ్యాపారిపై టీడీపీ నాయకుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ కొడవలి శివప్రసాద్, దౌర్జన్యం చేసి దాడికి పాల్పడిన ఘటన మంగళవారం మదనపల్లె మండలంలో జరిగింది. బాధితుడు మోహనమురళీ వివరాల మేరకు... అంకిశెట్టిపల్లె పంచాయతీ సురభీ కాలనీకి చెందిన మోహన మురళీ, బెంగళూరు రోడ్డులోని హంద్రీనీవా కాలువ సమీపంలో 1997లో 19 సెంట్ల స్థలం కొనుగోలు చేశాడు. మదనపల్లె మున్సిపల్ మాజీ చైర్మన్, టీడీపీ నాయకుడు కొడవలి శివ ప్రసాద్‌కు స్థలం పక్కనే భూమి ఉంది. మంగళవారం మోహన్‌మురళీ తన స్థలంలో షెడ్ నిర్మాణానికి పనులు చేసుకుంటుండగా, కొడవలి శివప్రసాద్, అతడి బావ మరిది, డ్రైవర్‌తోపాటు అక్కడికి వచ్చారు. పనులు చేయవద్దని మోహన మురళీని అడ్డుకున్నారు. అయితే, తన వద్ద పూర్తిస్థాయిలో సరైన రికార్డులు ఉన్నాయని, పనులు ఎందుకు అడ్డుకుంటున్నారని మోహన మురళీ ప్రశ్నించాడు. అవసరమైతే స్థలం సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని, తన స్థలం ఉంటేనే తనకు వదిలేయాలని కోరాడు. అయినా వారు వినకుండా వాగ్వాదానికి దిగడంతో ఘర్షణ తలెత్తింది. ఆవేశానికి లోనైన కొడవలి శివప్రసాద్, అతడి బావమరిది, వాహన డ్రైవర్‌లు ముగ్గురు మోహన మురళీపై దాడికి పాల్పడ్డారు. దౌర్జన్యం చేయడంతోపాటు చంపేస్తామని బెదిరించారు. దాడిలో గాయపడ్డ మోహన్ మురళీ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందాడు. ఘటనపై తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసి న్యాయం చేయాల్సిందిగా కోరాడు.
స్థలం వివాదంలో
మున్సిపల్ మాజీ చైర్మన్ దౌర్జన్యం