
అనుమతి లేకుండా సిజేరియన్ ఆపరేషన్లు
వేంపల్లె : స్థానిక కడప రోడ్డులో ఉన్న అరుణ హాస్పిటల్‌లో అనుమతులు లేకుండా అక్కడున్న(డీహెచ్‌ఎంహెచ్) వైద్యుడు విజయ్‌కుమార్ గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తుండగా పట్టుబడినట్లు సీఐ నరసింహులు తెలిపారు.
ఆదివారం డిప్యూటీ డీఎంహెచ్ ఖాజా మొహినిద్దీన్ ఫిర్యాదు మేరకు వైద్యులు విజయ్‌కుమార్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గత నెలలో ఎటువంటి అనుమతులు లేకుండా గర్భిణులకు ఆపరేషన్లు చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో.. ఆ హాస్పిటల్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తనిఖీలు నిర్వహించి సీజ్ చేశారన్నారు. అయినా కూడా హాస్పిటల్ వైద్యులు, వైద్య ఉన్నతాధికారులను లెక్క చేయకుండా సీజ్ చేసిన ల్యాబ్‌ను ఓపెన్ చేసి.. మరలా యథావిధిగా శనివారం రాత్రి ఇద్దరు గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తుండగా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఖాజా మోహినిద్దీన్ తనిఖీ నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. పులివెందుల డీఎస్‌పీ మురళి నాయక్, సీఐ నరసింహులు విచారణ చేసి వైద్యునిపై కేసు నమోదు చేశామని వివరించారు.
బెల్టు షాపులపై దాడి
లింగాల : మండలంలోని గ్రామాల్లో ఎస్సై అనిల్ కుమార్ బెల్ట్ షాపులపై ఆదివారం దాడులు నిర్వహించారు. చిన్న కుడాల, మురారి చింతల, వెలిదండ్ల, దిగువపల్లి, లింగాల గ్రామాల్లో బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అధిక ధరకు అమ్ముతున్న వారిపై దాడులు చేశారు. 47 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశామని ఎస్సై తెలిపారు. మండలంలో అక్రమ అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. దాడుల్లో లింగాల పోలీసులు పాల్గొన్నారు.
గుర్తుతెలియని మహిళ మృతి
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప–కనుమలోపల్లె రైల్వే మార్గంలో కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ మృతి చెందిందని రైల్వే పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు... మృతురాలికి 50 ఏళ్ల వయసు ఉంటుంది. ఆమె ఆచూకీ లభించకపోవడంతో మృతదేహాన్ని కడప రిమ్స్ మార్చురీలో భద్రపరిచారు. మృతురాలి వద్ద ప్లాస్టిక్ సంచిలో ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు ఉన్నాయని, ఆ మేరకు ఈమె ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకుని జీవనం సాగించేదని తెలియవచ్చిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
వైద్యుడిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు