రాయచోటి: పల్లె వైద్యం కుంటుపడింది. సమస్యల పరిష్కారానికి పీహెచ్‌సీల వైద్యులు చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరుకుంది. జ్వరాలతో ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం కరువైంది.ప్రభుత్వం సరైన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు డెంటల్, స్కిన్, ఆర్తో, కంటి వైద్య నిపుణులను అక్కడక్కడా ఏర్పాటుచేసిన ఫలితాలు కనిపించలేదు. చాలామంది వైద్యులు సెలవులపై వెళ్లినట్లు సమాచారం. దీంతో ఆసుపత్రికి వచ్చిన వారు అక్కడున్న నర్సులు, సిబ్బంది అందిస్తున్న వైద్యంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. జిల్లాలో 30 మండలాల్లో 51 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఒక పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు, ముగ్గురు నర్సులతో పాటు మిగతా సిబ్బంది ఉంటారు. ఇప్పుడు వైద్యులు లేకపోవడంతో పేషెంట్స్‌ను చూసే బాధ్యత నర్సులపై పడింది. కొన్ని వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ నివేదిక ద్వారా మందులు ఇవ్వాలి. ఈ పనులను నర్సులు చేయలేరు. దీంతో వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. డాక్టర్లు లేరని తెలుసుకున్న స్థానికులు వైద్యం కోసం పట్టణాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళుతున్నారు. మరికొందరు సమీపంలోని ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు.
● వైద్యుల ఇన్ సర్వీసు పీజీ కోటాను పునరుద్ధరించాలి, కచ్చితమైన పని గంటలను నిర్దేశించాలని కోరుతూ వైద్యులు సమ్మె చేస్తున్నారు. అయితే ప్రభుత్వం సమ్మెను విఫలం చేయాలన్న ఉద్దేశంతో ప్రత్యామ్నాయంగా సర్వజన ఆస్పత్రి.. తదితర ప్రభుత్వ విభాగాల నుంచి కొంతమంది వైద్యులను పీహెచ్‌సీలకు పంపింది. అయితే స్థానిక వైద్యులు సమ్మెలో ఉన్న కారణంగా పల్లెవాసులకు వైద్య సేవలు అందడం గగనంగా మారింది. ప్రభుత్వ మొండి వైఖరి పట్ల గ్రామీణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించి సమ్మె విరమణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
సమస్యలు పరిష్కరించాలి
వైద్యుల న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. ఇకపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైమరీ ఆరోగ్య కేంద్రాలకు వస్తున్న వైద్యుల మద్దతును కూడా కోరతాం. న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం.
–రమేష్ బాబు, జిల్లా ఏపీ ప్రైమరీ హెల్త్
సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
15వ రోజుకు చేరిన వైద్యుల సమ్మె..
వైద్యం అందక గ్రామీణలకు అవస్థలు