
మదనపల్లె జిల్లా కాబోతోందా...?
– నూతన భవన నిర్మాణాలకు స్థలం చదును
మదనపల్లె రూరల్ : మదనపల్లె జిల్లా కేంద్రంగా చేయాలంటూ గత కొంత కాలంగా అన్ని వైపుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జిల్లా కాబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అందులో భాగంగా మదనపల్లెలో నూతన ఎస్పీ క్యాంపు కార్యాలయం, డీఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు అందాయి. శుక్రవారం స్థానిక డీఎస్పీ మహేంద్ర ఆదేశాలతో తాలూకా పోలీసుస్టేషన్ వద్ద ఉన్న ఖాళీ స్థలాన్ని వన్‌టౌన్ సీఐ మహమ్మద్‌రఫీ పర్యవేక్షణలో ఎస్‌ఐలు శివకుమార్, అన్సర్‌బాషా చదును చేయించారు. రెండు రోజుల్లో జిల్లా ఎస్పీ ధీరజ్‌కనుబిల్లి నూతన భవన నిర్మాణాలకు భూమి పూజ చేయనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం రోజంతా పోలీసు అధికారులు స్థలం చదును చేయించే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఈ విషయమై డీఎస్పీ మహేంద్రను అడుగగా జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం, డీఎస్పీ నూతన కార్యాలయ భవన నిర్మాణాలకు అనుమతులు వచ్చిన విషయం వాస్తవమేనన్నారు. త్వరలోనే నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు.
గ్లోబల్ ఇంటర్న్‌షిప్ విజయవంతం
– ఏయూ అధినేత చొప్పా గంగిరెడ్డి
రాజంపేట : జర్మనీ ఆటోసాల్ వింటర్ స్కూల్ గ్లోబల్ ఇంటర్న్‌షిప్ విజయవంతం కావడం అభినందనీయమని అన్నమాచార్య యూనవర్సిటీ చాన్స్‌లర్ చొప్పా గంగిరెడ్డి కొనియాడారు. శుక్రవారం ఆటోసాల్ వింటర్‌స్కూల్ గ్లోబల్ ఇంటర్న్‌షిప్ విజయవంతం కావడానికి కారణమైన వారిని అభినందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీటెక్ విద్యార్ధి జగదీష్ సెప్టెంబరు 14 నుంచి 28 వరకు జర్మనీలో నిర్వహించిన గ్లోబల్ ఇంటర్న్‌షిప్ విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఏయూ ప్రో–చాన్స్‌లర్ చొప్పా అభిషేక్‌రెడ్డి ప్రోత్సాహంతో స్పాన్సర్ చేశారన్నారు. కార్యక్రమాన్ని ఆర్ డీ డీన్ డా.శివరామిరెడ్డి సమన్వయం చేయగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ వై.పవన్‌కుమార్‌రెడ్డి మద్దతు అందించారన్నారు. యూరోపియన్ ఆటోమొబైల్ పరిశ్రమ నిర్మాణం, పరిశోధన అవకాశాలు, స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్, ఇండ్రస్టీ 4.0 సాంకేతికలపై విస్తృతమైన అవగాహనను విద్యార్థిఽ జగదీశ్ పొందారన్నారు. ఏఐటీఎస్ వైస్‌చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, వీసీ సాయిబాబరెడ్డి, ప్రిన్సిపాల్ నారాయణ పాల్గొన్నారు.
అమరావతికి ఆశావాహుల పరుగులు
బి.కొత్తకోట : తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డిని నకిలీమద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా ఆయన్ను పార్టీ అధిష్టానం సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే. దీనితో ఇన్‌చార్జి పదవిని ఆశిస్తున్న టీడీపీ నేతలు మూడురోజులుగా అమరావతికి క్యూ కడుతున్నారు. నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అక్కడే మకాం పెట్టారు. స్థానికంగా ఒకరిద్దరు నేతలు ఇన్‌చార్జ్ పదవిని ఆశిస్తూ అధిష్టానం వద్దకు వెళ్లి తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు.

మదనపల్లె జిల్లా కాబోతోందా...?